ఇంట్లో మొక్కలుంటే శాంతి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందనేది సర్వసాధారణ నమ్మకం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కల్ని ప్రత్యేకంగా నిర్ణీత దిశల్లో నాటితే అదృష్టం వెంటడతుందని అంటున్నారు నిపుణులు. అందులో మొదటిచోటు మందార మొక్కదే. ఈ మొక్కను కేవలం పూజల కోసం మాత్రమే కాకుండా… ఇంటి వాతావరణాన్ని శుభప్రదంగా మార్చేందుకు కూడా ఉపయోగించవచ్చు.
వర్షాకాలం ప్రారంభమవుతోందంటే ప్రకృతి కొత్త జీవం పోసుకుంటుందన్న భావన చాలామందిలో ఉంటుంది. ఈ సమయంలో మందార మొక్కను నాటడం వాస్తు ప్రకారం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మందార పువ్వుకు హిందూ మతంలో విశేష స్థానం ఉంది. ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పుష్పంగా చెప్పబడుతుంది. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల శుభ ఫలితాలు, ఆర్థిక ప్రగతి, శాంతి చేకూరుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఎరుపు రంగు మందార మొక్క సూర్యునికి ప్రతీకగా భావించబడుతుంది. అందుకే తూర్పు దిశలో ఈ మొక్కను నాటడం శ్రేయస్కరం. మరోవైపు ఉత్తర దిశను లక్ష్మీదేవికి సంబంధించిన దిశగా పరిగణిస్తారు. అందువల్ల ఈ దిశలో కూడా మందార మొక్కను నాటడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం. పాజిటివ్ ఎనర్జీకి మార్గం సుగమమవుతుంది.
ముఖ్యంగా మంగళవారం రోజున హనుమంతుడికి మందార పువ్వును సమర్పించడం ద్వారా.. దోషాలు నివారించవచ్చు. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఈ పుష్పాన్ని అర్పిస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని చెప్పబడుతుంది. అలాగే దుర్గాదేవికి మందార పువ్వులతో పూజ చేస్తే కష్టాలు తొలగి మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందంటున్నారు పండితులు.
ఇంట్లో మందార మొక్కను పెంచడం వల్ల పూజకు ఉపయోగపడడమే కాదు, ఇంటి చుట్టూ శుభతను తీసుకురావడంలోనూ సహాయపడుతుంది. పంచతత్వాలకు అనుగుణంగా పెరిగే ఈ మొక్క.. మీ ఇంటి వాస్తు లోపాలను సవరించడంలో సహాయపడే శక్తిని కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో… మీరు కొత్తగా మొక్కలు నాటాలని భావిస్తే, మందార మొక్కకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఇది కేవలం పుష్పమొక్క మాత్రమే కాదు… దైవకటాక్షానికి ద్వారమై నిలుస్తుంది.
