పుట్టినరోజు అంటే బొమ్మలు, బెలూన్లు, కలర్‌ఫుల్ డెకరేషన్స్‌తో ఆహ్లాదభరితమైన వేడుకే. చిన్నారుల బర్త్‌డేల్లో హీలియం బెలూన్లు అయితే ప్రత్యేక ఆకర్షణగా మారిపోయాయి. కానీ అందరినీ ఆకట్టుకునే ఈ బెలూన్లు, ఒక్కోసారి ప్రాణాంతకంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంగ్లాండ్‌లోని మెర్సీసైడ్ ప్రాంతంలో జరిగిన ఓ విషాదకర ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది.
2024 ఏప్రిల్ 27న ఎనిమిదేళ్ల జాషువా డన్‌బార్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. కానీ ఆనందకరమైన ఆ రోజు, ఓ చీకటి ముసుగులో ముగిసింది. జాషువా తన బెడ్‌రూంలో ఊపిరాడక పడి ఉన్నాడు. అతని తలపై ఓ పెద్ద హీలియం బెలూన్ కప్పబడి ఉంది. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ, డాక్టర్లు అప్పటికే జాషువా ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు.
వైద్యులు పేర్కొన్న వివరాల ప్రకారం.. అతని ముఖాన్ని కప్పిన బెలూన్, చుట్టూ ఉన్న ఆక్సిజన్ ప్రవాహాన్ని అడ్డగించింది. హీలియం గ్యాస్‌కి రంగు, వాసన లేకపోయినా.. అది మనం పీల్చే ఆక్సిజన్‌ను పూర్తిగా బయటకు తోసేస్తుంది. ముఖ్యంగా చిన్నారులకు ఊపిరితిత్తుల శక్తి తక్కువగా ఉండటంతో, ఈ ప్రమాదం నిమిషాల్లోనే ఘోరంగా మారుతుంది.
ఈ ఘటన తర్వాత జాషువా తల్లి కార్లీ కన్నీళ్లతో తన మనోవేదనను వ్యక్తపరిచింది దయచేసి హీలియం బెలూన్లు కొనొద్దు. అవి అందంగా కనిపించొచ్చు, కానీ మా కొడుకును తీసుకెళ్లాయి. ఇంకెవ్వరూ మా లాంటి బాధను అనుభవించకూడదు అని తెలిపింది. హీలియం బెలూన్లు మాత్రమే కాదు చిన్న అయస్కాంతాలు, బటన్ బ్యాటరీలు, స్లైమ్‌లు, మరియూ పగిలిపోయే బెలూన్లు కూడా చిన్నారుల జీవితాలకు ప్రమాదం కలిగించే అవకాశముంది. పిల్లలు ఆటలో భాగంగా పొరపాటున వాటిని నోటిలో వేసుకున్నా, ప్రమాదం జరుగుతుంది. పెద్దవాళ్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఒక్కసారి చూపు తప్పినా ప్రమాదం పొంచి ఉంటుంది.
అందుకే… పిల్లల భద్రత విషయంలో ఒక్కో చిన్న విషయాన్ని సైతం నిర్లక్ష్యం చేయకూడదు. ఒక చిన్న జాగ్రత్త అనేక జీవితాలను కాపాడగలదు. చిట్టి ప్రాణాలు కన్నీటి బలులవ్వకుండా, ముందు జాగ్రత్తే ఉత్తమ రక్షణ.