Gujarat Assembly Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిందహో.!

Gujarat Assembly Election 2022:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశం దృష్టిని ఆకర్షించాకే, ఆయన దేశ రాజకీయాలపై కన్నేశారు. తొలిసారి ఎంపీ అవుతూనే ఆయన ప్రధాని పీఠమెక్కారు కూడా. అందుకే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు గతంలోనూ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి.. ఈసారి కూడా అంతకంటే ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి.

డిసెంబర్ 1, 5 తేదీల్లో పోలింగ్..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 1 అలాగే 5 తేదీల్లో.. అంటే రెండు విడతల్లో పోలింగ్ జరగబోతోంది. మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి గుజరాత్ రాష్ట్రంలో. ఇందులో ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అధికారంలో వుంది. 62 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్నారు. బీటీపీ నుంచి ఇద్దరు, ఎన్సీపీ నుంచి ఒకరు, ఓ స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేలుగా వున్నారు. ఐదు స్థానాలు ఖాళీగా వున్నాయిప్పుడు.

కాగా, బీజేపీ నినాదం డబుల్ ఇంజిన్ సర్కార్.. అదే నినాదంతో ఇంకోసారి సత్తా చాటుతామంటోంది బీజేపీ. అయితే, ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మరోపక్క, ఢిల్లీ నుంచి పంజాబ్‌కి విస్తరించిన ఆమ్ ఆద్మీ పార్టీ, గుజరాత్‌లోనూ అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా, గతంతో పోల్చితే ఈసారి అధికార బీజేపీకి గుజరాత్‌లో ఎదురుగాలి వీచే అవకాశాల్లేకపోలేదన్నది రాజకీయ పరిశీలకుల వాదన. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపైనా ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి.