ఇంట్లోకి అడుగుపెడుతూనే గుమ్మానికి ఎదురుగా వినాయకుని విగ్రహం కనిపిస్తే అదృష్టం అని చాలా మంది నమ్ముతారు. ఇంటికి ముందు విఘ్నేశ్వరుడు కాపలా ఉంటే సమస్యలు దూరమవుతాయని కొందరు భావిస్తారు. కానీ వాస్తు పండితుల మాట ప్రకారం ఇది పెద్ద తప్పే. ఎందుకంటే గణేశుడు ద్వారపాలకుడిగా ఉన్నప్పుడు ఎదురైన పరిస్థితులు పౌరాణికంగా కూడా, శాస్త్రపరంగానూ కొంత ప్రతికూల ఫలితాన్నే ఇస్తాయని చెబుతున్నారు.
పార్వతీదేవి స్నానానికి వెళ్తూ, తన ముద్దుల కుమారుడు గణేశుడిని ద్వారం వద్ద నిలబెట్టి లోపలికి ఎవ్వరూ రాకుండా చూసుకోమని చెప్పిందని పురాణం చెబుతుంది. శివుడు వచ్చినప్పుడు, వినాయకుడు అడ్డగించినందున అతని తల నరికి చివరికి ఏనుగు తలతో గణేశుడిని తిరిగి జీవింపజేశాడు. ఈ ఘట్టం వినాయకుడి జీవితంలో బాధనిచ్చిందని భావించి ద్వారపాలకుడిగా పెట్టడం వాస్తు ప్రకారం శుభం కాదని చెబుతారు.
శక్తి ప్రవాహానికి అడ్డంకి: ఇంటి గుమ్మం నుంచే శుభ శక్తి లోపలికి వస్తుంది. గుమ్మానికి నేరుగా వినాయకుడు ఉంటే, ఆ శక్తి ఇంట్లోకి వెళ్లకుండా అడ్డంగా నిలబడినట్టు అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. విఘ్నహర్త ఇంట్లోకి వెళ్లి సమస్యలు తొలగించాలి కాని బయటే ఆగిపోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కడ పెట్టాలి: గణపతిని పూజా గదిలో ఈశాన్యం లేదా తూర్పు వైపున పెట్టడం శ్రేష్ఠం. ఇంటి హాల్లో పెట్టాలంటే ఉత్తరం లేదా తూర్పు గోడను ఎంచుకోవాలి. చిన్న విగ్రహం ఉంటే బాగుంటుంది మట్టి లేదా ఇత్తడితో చేసిన విగ్రహాలు మేలైనవి. చదువుకునే డెస్క్, ఆఫీస్ కేబిన్‌లోనూ చిన్న గణేశుడు సౌఖ్యాన్ని ఇస్తాడు. కానీ పడకగది, బాత్రూమ్, గుమ్మానికి ఎదురుగా మాత్రం విగ్రహం పెట్టకూడదు.
ఇంకా కొంచెం జాగ్రత్తలు: పగిలిన విగ్రహాలు ఇంట్లో ఉంచకూడదు. ఎల్లప్పుడూ శుభ్రమైన స్థలంలో, ఎత్తుగా పెట్టాలి. నేలపై నేరుగా ఉంచకూడదు. ఇలా వాస్తు చిట్కాలను పాటిస్తే వినాయకుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. మరి ఇప్పటికైనా గుమ్మానికి ఎదురుగా ఉన్న విగ్రహం ఉంటే, సరియైన స్థలానికి మార్చేయండి. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని ధృవీకరించడం లేదు.)