గణపతి విగ్రహాలను కొనేటప్పుడు.. తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే.. లేకపోతే..!

వినాయక చవితి సమీపిస్తున్న వేళ, ప్రతి ఇంటి ముందు వినాయక విగ్రహాల కొనుగోలు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మార్కెట్లు, బజార్లు వినాయక విగ్రహాలతో కళకళలాడుతున్నాయి. అయితే గణపతి విగ్రహాన్ని సరైన రూపంలో, సరైన నిబంధనలకు అనుగుణంగా ఎంచుకోవడం చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు. ఇంట్లో శుభాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అభివృద్ధిని కోరుకునే వారికీ గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసినప్పుడే.. కొన్ని కీలక అంశాలు విషయంగా గుర్తుంచుకోవాలి.

గణపతి విగ్రహం కొనేటప్పుడు తొండం ఎటు వైపున వంగి ఉందో ప్రత్యేకంగా చూడాలి. ఎడమ వైపున (మీరు చూస్తే మీ ఎడమ వైపు) తొండం వంగి ఉన్న వినాయకుడిని ‘వామముఖి మూర్తి’ అని పిలుస్తారు. ఇలాంటి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించటం వల్ల ప్రశాంతత, సంపద, ఆరోగ్య సౌఖ్యం, కుటుంబ అభివృద్ధి దక్కుతాయని నమ్మకం ఉంది. ఎడమ తొండం చంద్ర శక్తిని, పాజిటివ్ ఎనర్జీని సూచిస్తుంది. ఎడమ వైపు తొండం ఉన్న గణపతి విగ్రహాన్ని ఎవ్వరైనా, ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రతిష్ఠించొచ్చు.

గమనించాల్సిన మరో అంశం కుడి వైపు తొండం వంగి ఉండే విగ్రహం. దీనిని ‘సిద్ధి వినాయకుడు’గా, ‘దక్షిణామూర్తి’గా పిలుస్తారు. ఈ విధంగా ఉన్న వినాయక విగ్రహానికి ఆలయాల్లో, మఠాల్లో ప్రత్యేక పూజలు సాగిస్తారు. ఇంట్లో ప్రతిష్ఠించాలంటే నియమ నిష్ఠలతో, ప్రత్యేక శుద్ధి, నియమ విధానాలు పాటించాల్సి ఉంటుంది. సాధారణ కుటుంబల్లో, నిత్య పూజలకు మాత్రం ఎడమ వైపు తొండం వంగిన వినాయక విగ్రహమే శ్రేయస్కరం అని వాస్తు నిపుణులు, శాస్త్రపోథులు చెబుతున్నారు.

విగ్రహాన్ని ఎంపిక చేయడంలో విగ్రహ పదార్థానికి అధిక ప్రాముఖ్యత ఉంది. పర్యావరణ హితమైన మట్టి విగ్రహాన్ని తీసుకోవడం మంచిది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP) విగ్రహాలు పర్యావరణానికి హానికరం. అలాగే, శరీరంలోని అన్ని భాగాలు.. రెండు కళ్ళు, రెండు చెవులు, నాలుగు చేతులు, పెద్ద పొట్ట, ముఖంలో శాంతి, మురిపెం స్పష్టంగా కనిపించాలి. చీలికలు, పగుళ్ళు, తెగిన భాగాలు లేని విగ్రహాన్నే ఎంపిక చేయాలి. విగ్రహాన్ని తీసుకురాగానే గంగాజలంతో శుద్ధి చేసి, పసుపు, కుంకుమతో అలంకరించి, నిత్య పూజలు ప్రారంభించడం మంచిది.

ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే వినాయక చవితి పూజలు మరింత శుభంగా, శ్రేయస్సుతో జరుగుతాయి. ఇంట్లో శుభ శాంతులు, ఆరోగ్యం, ధనసంపద, కుటుంబ ప్రేమ పెరుగుతాయి. వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహం ఎంపికలో ఈ విషయాల్ని తప్పకుండా గుర్తుంచుకుని, సమీకరించుకున్న ప్రతీ కుటుంబం పాజిటివ్ ఎనర్జీని సంతరించుకుంటుంది.