కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ లో భాగంగా వచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల అన్నారో.. లేక. తనవద్ద ఏమైనా సమాచారం ఉందో.. అదీగాకపొతే బురదజల్లే కార్యక్రమంలో భాగంగా అన్నారో తెలియదు కానీ… తాజాగా రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంట బళ్లారి సిటీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి!
ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది ఊహించినట్లుగానే ఈ ఎన్నికలో బీజేపీ ఓటమిపాలైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కాంగ్రెస్ విక్టరీ సాధించింది. ఈ నేపథ్యంలో… అసలు బీజేపీ ఎందుకు ఓడిపోయింది అనే విషయాలపై చర్చించేందుకని కర్ణాటక బీజేపీ నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేసుకున్నారు.
ఈ సందర్భంగా మైకందుకున్న గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి… బళ్లారిలో బీజేపీకి మళ్లీ పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోలేదని.. కాంగ్రెస్ ఉచిత హామీలు గెలిచాయని కొత్త లాజిక్ ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా… ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా… కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం బస్సుల సంఖ్యను తగ్గించేసిందని ఆరోపించిన ఆయన.. ఇదే సమయంలో బస్సుల్లో నేడు ఫ్రీగా తిరుగుతున్న మహిళలు… భవిష్యత్తులో నాలుగింతలు ఎక్కువగా టిక్కెట్ల ధర చెల్లించాల్సి వస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా శుక్రవారం పాట్నా వేదికగా ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో మాట్లాడిన బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్… రాహుల్ ని ఉద్దేశించి పెళ్లి చేసుకోవాలని సూచించారు. అయితే ఈ విషయాలపై కూడా స్పందించిన గాలి సోమశేఖర్ రెడ్డి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. రాహుల్ కు ఇప్పటికే పెళ్లైపోయిందని సోమశేఖర్ రెడ్డి అన్నట్లు కథనాలొస్తున్నాయి.
అవును… రాహుల్ గాంధీకి అప్పటికే పెళ్లయిందని, రాహుల్ గాంధీకి పిల్లలు కూడా ఉన్నారని సోమశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. ఇదే సమయంలో… కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మన దేశంలో సన్యాసిగా, బ్యాచిలర్ గా తిరుగుతున్నారు కానీ… విదేశాల్లో మాత్రం సంచారిగా, సొగ్గాడిగా తిరుగుతున్నారని.. అక్కడ రాహుల్ కు భార్యా, పిల్లలూ ఉన్నారని సోమశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సమాచారం.
అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సోమశేఖర్ రెడ్డికి ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు. గతంలో విలేఖరులపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన దగ్గరకు వచ్చి ఒకరిద్దరు విలేకరులు నెలనెలా మామూళ్లు ఇమ్మని అడిగారని.. తాను ఇవ్వకపోయేసరికి తనపై వ్యతిరేక వార్తలు రాస్తున్నారని చెప్పుకొచ్చారు.