తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ కు రాజీనామా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చేరిన ఏడాదికే ఇలా పార్టీకి గుడ్ బై చెప్పడం ఇప్పుడు టాప్ లెవెల్ చర్చగా మారింది. ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో పెద్ద చిచ్చు పెట్టినట్లు కనిపిస్తోంది.
నిజానికి కోనప్ప రాజకీయ ప్రయాణం అంతా వాడివేడిగా సాగుతోంది. 2014లో బీఎస్పీ నుంచి గెలిచి, తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018లో బీఆర్ఎస్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత బీఆర్ఎస్ లో కూడా అసంతృప్తితో, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో అడుగు పెట్టారు. కానీ కాంగ్రెస్ లో కూడా కొంతకాలం గడిపిన తర్వాత పార్టీని వీడటం, రేవంత్ రెడ్డి పై కఠిన విమర్శలు చేయడం కొత్త చర్చకు దారితీసింది.
కోనప్ప రాజీనామా చేసిన వెంటనే ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీగా మారిందని, కొత్త బిచ్చగాళ్లు కాగజ్ నగర్ లో తిరుగుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరు చేసిన ఫ్లై ఓవర్ ప్రాజెక్టును రద్దు చేయడమే తన రాజీనామాకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
ఇప్పుడు అతను ఏ పార్టీలోనూ చేరబోనని, స్వతంత్రంగా ఉంటానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. అయితే, ఇదే సమయంలో ఆయన తాజాగా జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిని సమర్థిస్తున్నట్లు ప్రకటించడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఇది ఆయన మళ్లీ బీఎస్పీ వైపు అడుగు వేయబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది.
మొత్తానికి, కోనప్ప కేవలం పార్టీ మారడమే కాకుండా, కాంగ్రెస్ పై విమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. ఒక పక్క తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై రోజురోజుకీ ఒత్తిడి పెరుగుతుంటే, మరో పక్క ఇలాంటి కీలక నేతల బయటకు రావడం రేవంత్ రెడ్డి నాయకత్వానికి కొత్త సవాలుగా మారింది. మరి, ఈ ట్విస్ట్ తర్వాత కోనప్ప ఏ వైపు మళ్లుతారు కాంగ్రెస్ దానికి ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.