Medical College Privatization: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసిపీ చేపట్టిన ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని చెప్పినా అతిశయోక్తి కాదు. వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చేపట్టిన రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. డిసెంబర్ 15న రోడ్లపై వైసీపీ జెండాలు చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.
ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి..!
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సహేతుకం కాదనే గొంతులే ఎక్కువగా వినిపిస్తున్నాయనే విషయం బయటకు వచ్చినట్లేనా?
పేదలకు చేరువలో ఉచితంగా సూపర్ స్పెషాల్టీ వైద్యం, విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను చిదిమేశారంటూ జగన్ చేస్తోన్న విమర్శలకు జనం స్పంధించినట్లేనా?
కేవలం వైసీపీ కార్యకర్తలు మాత్రమే కోటి సంతకాలు చేశారని అనుకుంటే అది ఆత్మవంచనేనా?
ఏది ఏమైనా రాష్ట్రవ్యాప్తంగా సంతకాలు చేసిన ఈ కోటి మంది మాటా గవర్నర్ వింటారా? తదనుగుణంగా చర్యలు తీసుకుంటారా?
ఎవరు అవునన్నా, కాదన్నా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సహేతుకం కాదనే గొంతులే ఎక్కువగా వినిపిస్తున్నాయనే విషయం బయటకు వచ్చినట్లే అనే చర్చ సామాన్యుల్లోనూ, అటు మేధావుల్లోనూ, విశ్లేషకుల్లోనూ వినిపిస్తోంది. పైగా ప్రజాస్వామ్య దేశంలో కోటి మంది ప్రజల గొంతు ఒకే విషయాన్ని నొక్కి చెప్పిన అంశాని అంత సులువుగా తీసుకోకూడదు!

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు 1,53,84,576 కాగా వైసీపీకి వచ్చిన ఓట్లు 1,32,84,134. పైగా టీడీపీకి పక్కన బీజేపీ, జనసేన మద్దతు ఉన్న పరిస్థితి. ఈ సమయంలో కోటి మంది జనాలు పనిగట్టుకుని సంతకాలు చేసి, అందులో గరిష్టంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారంటే.. ఇది కచ్చితంగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన విషయమే!
జిల్లా కేంద్రాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లడం.. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీల నడుమ వాహనాల్లో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతులను తరలించడం జరిగినప్పుడు తెరపైకి వచ్చిన దృశ్యాలు గ్రీన్ మేట్ కాదు, ఏఐ కాదు, సన్నని పరదాలు కట్టి మధ్యలో నడిపించిన ర్యాలీలూ కాదు. ఏది ఏమైనా ఇది ప్రజా ఉద్యమం! కాకపోతే వైసీపీ భూజానికి ఎత్తుకుంది.
వైసీపీ నేతలు అన్నారనో, జగన్ మండిపడ్డారనో కాదు కానీ… భూమి ప్రభుత్వానిది.. మెడికల్ కాలేజీలు ప్రభుత్వానివి.. ఆస్పత్రులు ప్రభుత్వానివి.. అందుకు అయిన ఖర్చు ప్రభుత్వానిది.. కానీ, ప్రయోజనం పొందేది, పెత్తనం చేసేది మాత్రం ప్రైవేటు వ్యక్తులా అనే ప్రశ్నలు ఇటీవల బలంగా వినిపించాయనే చెప్పాలి.
ఇలా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరిన కోటి ప్రతులను వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఈ నెల 18న గవర్నర్ ను కలిసి నివేదించి ప్రజా స్పందనను వివరించనున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ కోటి మంది ప్రజల అభిప్రాయాలను గవర్నర్ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

