రైలు ప్రమాదంపై సీబీఐ మాజీ డైరెక్టర్‌ వ్యాఖ్యలు వైరల్!

ఒడిశాలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన వందల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొల్పగా… వందల జీవితాలను అర్ధాంతరంగా ముగించేసింది. భారత రైల్వే వ్యవస్థలో నెలకొన్ని అత్యంత ఘోర ప్రమాదల్లో ఒకటిగా ఈ తాజా సంఘటన పుటల్లోకి ఎక్కింది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై సీబీఐ మాజీ డైరెక్టర్ స్పందించారు.

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం విషయంలో ప్రభుత్వంపైనా, రైల్వే వ్యవస్థపైనా తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజినామా చేయాలని విపక్షాలు, నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే ఈ సమయంలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రమాదంలో కుట్ర కోణం ఉందనే విషయాన్ని తెరపైకి తెచ్చారు. అనంతరం ఈ ఘటనపై సీబీఐ ఎంక్వరీకి డిమాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ విషయాలపై తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్‌, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఎం.నాగేశ్వరరావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, రైల్వే అధికారులు తమ వైఫల్యం, అసమర్థతలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

“కోరమాండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ దుర్ఘటనలో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఐటీ సెల్‌ లోని పెయిడ్‌ ఆర్టిస్టులు దానికి అన్ని రకాల అబద్ధాలూ గుప్పించి, మతపరమైన మసాలా జోడించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు” అంటూ ఆన్ లైన్ లో స్పందించిన నాగేశ్వరరావు.. ఎక్కడ పెద్ద ప్రమాదం జరిగినా రైల్వే అధికారులకు ఇది అలవాటేనని సంచలన కామెంట్స్ చేశారు.

ఇదే సమయంలో మరో ట్వీట్ చేసిన ఆయన… “రెండు రైల్వే పోలీసు జిల్లాలకు ఎస్పీగా, ఒడిశా రైల్వే పోలీసు అదనపు డీజీపీగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నాను. ఎప్పుడు రైలు ప్రమాదం జరిగినా ప్రజల దృష్టి మళ్లించేందుకు, వారి లోపాల్ని, అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుట్ర జరిగిందని చెప్పడం రైల్వే అధికారులకు అలవాటైన ఎత్తుగడే. దర్యాప్తు నివేదిక బయటకు వచ్చేసరికి ప్రజలు దాన్ని మర్చిపోతారు” అని పేర్కొన్నారు.

దీంతో ప్రమాదంపై ప్రజల దృష్టి మళ్లించేందుకు, ప్రజలు వీలైనంత త్వరగా ఈ విషయాన్ని మరిచిపోయేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ మేరకు ఈ “కుట్ర” అనే ఎత్తుగడ వేసిందని ఫిక్సయిపోవచ్చని కమెంట్లు చేస్తున్నాయి విపక్షాలు. ఫలితంగా ఈ వాదనకు బలం చేకూరుస్తున్నారు నెటిజన్లు! ఏది ఏమైనా… సీబీఐ మాజీ డైరెక్టర్ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలను ఆలోచింపచేసేలా ఉన్నయని మాత్రం చెప్పవచ్చు!!