పవ‌న్‌కేం వందంటాడు..మీరెందుకు బాబు సవాళ్లు చేస్తున్నారు

Following Pawan's plans is dangerous to Chandrababu Naidu
రాజధానిగా అమరావతిని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు టీడీపీ, జనసేనలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.  అయినా ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో నిరసనను మరింత ఉధృతం చేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావించారు.  అందుకే పవన్ ఒకడుగు ముందుకేసి ఎమ్మెల్యేల రాజీనామాలు అడిగేశారు.  అమరావతిని కాదని వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పేర్లతో ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడిన పవన్ అమరావతి రైతులకు మద్దతుగా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని మరీ ప్రధానంగా రాజధానిని కోల్పోయిన క్రిష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ వినిపించారు.  పవన్ అడిగినట్టు అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఎలాగూ రాజీనామాలు చేయరు.  ఇక మిగిలింది టీడీపీనే. 
 
పవన్ రాజీనామా సవాళ్లు విన్న వెంటనే బాబుగారు కూడా అదే మాట ఎత్తుకున్నారు.  వైఎస్ జగన్ మాట తప్పారని, ఎన్నికల ముందు మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించకుండా ఇప్పుడు మూడు ముక్కలాట ఆడుతున్నారని, ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, రాజీనామాలు చేయడం తమకు నిమిషం పనని, అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఎన్నికల్లో తమను ప్రజలు తిరస్కరిస్తే మూడు రాజధానులను శిరసా వహిస్తామని అన్నారు.  వైఎస్ జగన్ మూడు రాజధానుల ఎజెండాతోనే బరిలోకి దిగాలని సవాల్ విసిరారు.  ఇప్పటికిప్పుడు బాబు సవాలుబు స్వీకరించేసి జగన్ అసెంబ్లీని రద్దు చేసి పారేసి బస్తీ మే సవాల్ అంటూ ఎన్నికలకు దిగరని అందరికీ తెలుసు.  కానీ ఒకవేళ దిగితే పరిస్థితి ఏమిటని ఆలోచిస్తే బాబుగారు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని అనిపిస్తోంది. 
 
బాబుగారు మాట్లాడుతూ తమ 23 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తానని అన్నారు.  అసలు టీడీపీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా అనేదే ప్రశ్న.  ఎందుకంటే ముగ్గురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలు ఇప్పటికే అనధికారికంగా టీడీపీకి దూరమై వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.  గత రాజ్యసభ ఎన్నికల్లోనే ఈ సంగతి రూఢీ అయింది.  వీరు ముగ్గురూ ఇప్పటికిప్పుడు బాబు మాట విని రాజీనామా చేసేస్తారా అంటే అది జరగని పని.  సో.. అనధికారికంగా టీడీపీ నెంబర్ 20కి పడిపోయింది.  ఇక మరొక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఏమిటో ఇంకా క్లారిటీ లేదు.  ఆయన పార్టీలో ఉన్నట్టా లెనట్టా అనేది తేలాల్సి ఉంది.  పైపెచ్చు ఆయన విశాఖ జిల్లా నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు.  విశాఖను రాజధానిగా వ్యతిరేకిస్తూ ఆయన్ను రాజీనామా చేయమంటే చేస్తారా.. చేసినా గెలుస్తారా. 
 
అలాగే విశాఖ నుండి టీడీపీ నేతలు గన బాబు, గణేష్ కుమార్, రామకృష్ణ నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.  వీరి రాజీనామాలు కూడా డౌటే.  తెగించి చేసినా విశాఖకు వ్యతిరేకంగా రాజీనామాలు చేసిన వీరిని అక్కడి ప్రజలు మళ్లీ గెలిపిస్తారా అంటే ముమ్మాటికీ డౌటే.  సో ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు, ఒక క్కన్ఫ్యూజ్డ్ ఎమ్మెల్యే, డేంజర్ జోన్లో పడబోయే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వెరసి మొత్తం అక్కడే 7 గురు ఎగిరిపోయారు.  ఇక మిగిలింది 16 మంది మాత్రమే.  ఆ 16 మంది రాజీనామాలు చేసి తర్వాత కూడా గెలిచారనే అనుకుందాం.  ఆల్రెడీ గెలిచిన స్థానాల్లో మళ్లీ గెలిచి టీడీపీ సాధించేదీ, నిరూపించుకునేదీ ఏముంటుందో బాబుగారికే తెలియాలి.  ఇక ఆ 16 స్థానాల్లో గత ఎన్నికల్లోనే వైసీపీని జనం తిరస్కరించారు కాబట్టి మళ్లీ ఓడించినా వారికొచ్చే నష్టమేమీ లేదు. 
 
అలా కాకుండా పొరపాటున ఒక్క స్థానంలో అయినా టీడీపీ ఓడిపోతే కలిగే నష్టం మామూలుగా ఉండదు.  మూడు రాజధానులను వద్దన్నందుకే జనం ఓడగొట్టారని వైసీపీ గోల గోల చేస్తుంది.  సో..రాజీనామాల ఛాలెంజ్ బాబుగారికి పెద్దగా మేలు చేయదు కానీ కొద్దిగా మిస్ ఫైర్ అయినా బర్నింగ్ డ్యామేజ్ మాత్రం మాములుగా ఉండదు.  ఇక జనసేన విషయానికి వస్తే వారికి ఉన్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే.  ఆయన కూడా వైసీపీకి అనుకూలంగానే వ్యహరిస్తున్నారు కాబట్టి రాజీనామా చేసినా చేయకపోయినా, చేసి ఓడిపోయినా జనసేనకు జరిగే నష్టం ఏమీ ఉండదు.  కాబట్టే పవన్ ఎన్ని సవాళ్ళైనా విసురుతాడు.  కానీ ముల్లు కింద ఆకులా ఉంది టీడీపీనే.  చిన్న కుదుపు ఏర్పడినా చిల్లు తప్పదు.  కాబట్టి ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేసే ముందు చంద్రబాబు కాస్త ముందూ వెనక చూసుకుంటే మంచిది.