Floods In AP: దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు.. నదులకు పోటెత్తిన వరదలు.. మంత్రుల హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ప్రభావం కొనసాగుతోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీనితో కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రభుత్వం ముందస్తుగా సహాయక చర్యలు చేపట్టి, ప్రజలను అప్రమత్తం చేసింది.

కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న కారణంగా ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది. అధికారులు ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

శ్రీశైలం డ్యాం వద్ద ఇన్‌ఫ్లో 3.06, ఔట్‌ఫ్లో 3.62 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ వద్ద ఇన్‌ఫ్లో 2.69, ఔట్‌ఫ్లో 3.17 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల వద్ద ఇన్‌ఫ్లో 3.13, ఔట్‌ఫ్లో 3.72 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 5.31 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రేపటికి మొదటి హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మంత్రులు, అధికారుల సమీక్షలు:

రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. ఉత్తరాంధ్ర, అల్లూరి, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అల్పపీడనం కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించారు. హోంమంత్రి అనిత కూడా వరదలపై సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి అధికారులను అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

కృష్ణా, గోదావరి, తుంగభద్ర నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం సూచించింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

జగన్ డిక్లరేషన్ ఇస్తారా? | Analyst Ks Prasad EXPOSED Big Twists in Ys Jagan Tirumala Declaration |TR