వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంత గొప్ప నాయకుడిగా మన్ననలు అందుకోవడానికి, ఇప్పటికీ జనుల హృదయాల్లో నిలిచి ఉండటానికి కారణం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కారణం. ఒక్కోసారి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ధిక్కరించిన సందర్భాలున్నాయి. అలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోబట్టే మంచి పాలన అందించగలిగారు ఆయన. ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాల్లో రైతులకు ఉచిత విద్యుత్ కూడ ఒకటి.
అప్పటివరకు కరెంట్ ఛార్జీల మోతతో నడ్డి విరిచి ఉన్న రైతన్నలకు ఉచిత విద్యుత్ అంటూ వైఎస్సార్ ఇచ్చిన హామీ కొత్త ఆశలు రేకెత్తించింది. ఆ హామీను చూసే రైతులంతా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. వైఎస్సార్ సైతం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే అదే వేదిక మీద నిలబడి ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం చేసి నాయకుడంటే ఇలా ఉండాలి అనిపించుకున్నారు. ఆ ఒక్క సంతకం అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపిందనడంలో సందేహమే లేదు.
వైఎస్సార్ ఉన్నన్ని రోజులు ఆ పథకాన్ని మానస పుత్రికగా భావించి చాలా జాగ్రత్తగా నడిపారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సైతం ఉచిత విద్యుత్ విధానాన్ని తాకడానికి సాహసించలేదు. ఇక వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తానని, పెద్దాయన అడుగుజాడల్లోనే నడుచుకుంటానని అన్నారు. దీంతో ఉచిత విద్యుత్ విధానానికి ఎలాంటి ఢోకా ఉండదని రైతులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్ హాయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్ విధానం మీద అనుమానాలు, ఆందోళనలు కలిగే పరిస్థితి తలెత్తింది. అందుకు కారణం ఉచిత విద్యుత్ విధానంలో రాష్ట్రం తీసుకొస్తున్న సంస్కరణలే.
వైఎస్ జగన్ మాత్రమే ఒప్పుకున్నారెందుకు ?
ఇన్నాళ్లు మీటర్లు, రీడింగులు, బిల్లులు, చెల్లింపులు లాంటి బాదరబందీలేవీ లేకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులతో రైతుల మోటార్లకు మీటర్లు తగిలించనున్నారు. మోటార్లకు మీటర్లు అనేసరికి రైతుల గుండెల్లో బండ పడినంత పనైంది. ఎంత బిల్లు వస్తే అంతా ప్రభుత్వమే చెల్లిస్తామంటున్నా కూడ రైతుల్లో ఆందోళన తగ్గట్లేదు. ఈ తలనొప్పి మొత్తం కేంద్రం విధించిన నిబంధనల కారణంగా వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల ద్రుష్ట్యా ప్రతి రాష్ట్రం అప్పుల కోసం వెంపర్లాడుతోంది. ఎఫ్ఆర్బీఎం రాష్ట్రాలకిచ్చే రుణ పరిమితిని 5 శాతానికి పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం సూచించిన విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోవాలనే షరతు పెట్టింది. వాటిలో భాగంగా ఉచిత విద్యుత్ పథకాలకు గాను నేరుగా లబ్ధిదారులకు నగదు బదిలీని అమలు చేయాలని తెలిపింది.
అంటే మీటర్లు లేకుండా కరెంట్ వాడకం కుదరదు. డిస్కంలకు ఎంత కరెంట్ వాడకం జరుగుతోంది, ఎంతెంత ఛార్జీలు చెల్లించాలి లాంటి లెక్కలు పక్కాగా తెలియాలి. ఆ ఛార్జీలను నగదు బదిలీ రూపంలో చెల్లిస్తారు. అప్పుడే రాష్ట్రాలు డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపు ఖచ్చితంగా ఉంటుంది. దీని ద్వారా నష్టాల్లో ఉన్న డిస్కంలను పైకి లేపాలన్నది కేంద్రం ఉద్దేశ్యం. అసలే అప్పుల్లో ఉంటే కొత్త అప్పులు పుట్టాలంటే ఈ కండీషన్లు ఏమిటని దాదాపు అన్ని బీజేపీ యేతర ప్రభుత్వాలు అడ్డం తిరిగాయి. ఈ సంస్కరణలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నాయి. కానీ వైఎస్ జగన్ మాత్రం ఒక్క మాట కూడ మాట్లాడలేదు. కేంద్రం చెప్పింది కాబట్టి ఒప్పుకుని తీరాల్సిందే అన్నట్టు ఉచిత విద్యుత్ పథకాన్ని నగదు బదిలీ పథకంగా మారుస్తున్నారు. రైతులను ఇంత గందరగోళానికి గురిచేస్తున్న, ప్రభుత్వ ప్రతిష్టను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్న ఇలాంటి మార్పును ఇంత ఈజీగా అంగీకరించడం వెనుక కారణం వైసీపీ నేతలకే తెలియాలి.
అర్థం కాక, అనుమానం తీరక రైతులు :
ఇన్నాళ్లు ఉచిత విద్యుత్ పొంది కష్టాల నుండి కొద్దిగా తేరుకున్న రైతులు ఇకపై ఉచితం కాదని, మీటర్లు పెడతారని అనగానే ఆందోళనలో పడిపోయారు. ప్రభుత్వ పెద్దలేమో కేంద్రం చెప్పింది కాబట్టే చేయాల్సి వచ్చింది అంటున్నా, ఎంత బిల్లు వస్తే అంతా మీ ఖాతాల్లోకి వేస్తాం. దాన్ని మీరే చెల్లించడమా లేకపోతే ప్రభుత్వమే నేరుగా డిస్కంలకు మళ్ళించడంమో చేస్తుంది. మీకెలాంటి ఇబ్బందీ ఉండదు అని చెబుతున్నా ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. ఇక ప్రతిపక్షాలు ఎలాగూ వాటి పని అవి చేస్తున్నాయి. కేవలం ఇది ఉచిత విద్యుత్ పథకాన్ని దశల వారీగా ఎత్తివేసే ప్రయత్నమని, ఉచితమే అంటూ మళ్లీ మీటర్లు, బిల్లులు, నగదు బదిలీలు, చెల్లింపులు అంటూ ఈ గందరగోళం ఎందుకు. కేంద్రం ఏం చెబితే అది చేసేస్తారా అంటూ విరుచుకుపడుతుంటే వామపక్షాలు అసలే అప్పుల్లో ఉంటే ఈ నగదు బదిలీలు జరిగే పనేనా. ఒకవేళ రాష్ట్ర ఖజానాలో నిధులు లేక బయట అప్పులు పుట్టకపోతే రైతుల పరిస్థితి ఏమిటి అంటూ లాజిక్స్ లాగుతున్నారు. దీంతో రైతుల్లో రేపటి రోజున ఏం జరుగుతుందో అనే అనుమానాలు చెలరేగుతున్నాయి. మొత్తానికి వైఎస్ జగన్ నిర్ణయం రాజన్న మానస పుత్రికను సందిగ్ధంలో పడేసినట్టైంది.