సమాజంలో విలువలు క్రమంగా పడిపోతున్నాయనే విమర్శలు తరచూ వినిపిస్తాయి. కానీ ఈసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఆ ఆందోళనలను మరింత బలపరచింది. వివాహేతర సంబంధాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఓ యాప్ ఉందని చెబుతున్న వీడియో ప్రస్తుతం నెటిజన్ల మధ్య చర్చనీయాంశమైంది. టెక్నాలజీ మనకు సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో వచ్చింది.. కానీ ఇప్పుడు మానవ సంబంధాల పతనానికి కారణమవుతోందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఆ యాప్ పేరు గ్లీడెన్. దీన్ని “సీక్రెట్ అఫైర్స్” కోసం రూపకల్పన చేశారట. ఇందులో మహిళలు ఉచితంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు కానీ పురుషులు మాత్రం కనీసం రూ.1800 చెల్లించాలి. మెసేజ్ చదవడం, గిఫ్ట్‌లు పంపడం వంటివన్నీ అదనపు ఖర్చులు. మరీ ముఖ్యంగా, ఎవరికీ అనుమానం రాకుండా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో “గ్లీడెన్” అనే పేరు చూపించకుండా “గూగుల్ జీడి మీడియా” అనే పేరుతో మాత్రమే ఎంట్రీ చేస్తారట. అంతేకాదు, పక్కన ఎవరైనా ఉన్నప్పుడు వెంటనే లాగౌట్ అయ్యేలా “క్విక్ ఎగ్జిట్” బటన్ కూడా అందుబాటులో ఉందని చెబుతున్నారు.
“ఇది నిక్కచ్చిగా చెప్పాలంటే చీటింగ్‌కే బలంగా ప్రోత్సాహం ఇవ్వడమే” అని వీడియోలోని వ్యక్తి గట్టిగా విమర్శించాడు. ఈ వ్యాఖ్యలకు అనుకూలంగా చాలామంది నెటిజన్లు స్పందిస్తూ, ఇలాంటి యాప్‌లు మన సమాజాన్ని దారితప్పిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. కామెంట్స్ విభాగంలో నెటిజన్ల ఆవేదన స్పష్టంగా కనిపించింది. “ప్రతి రోజు సమాజం ఇంకా చెడిపోతోంది” అని ఒకరు స్పందిస్తే, “ఇలాంటి యాప్‌లను తక్షణం నిషేధించాలి” అని మరొకరు కామెంట్ చేశారు. “ఏం రోజులు వచ్చాయో… మోదీజీ, ఇలాంటివి ఇండియాలో బ్యాన్ చేయండి ప్లీజ్” అని మరో నెటిజన్ విజ్ఞప్తి చేశాడు.
సైబర్ నిపుణులు కూడా ఇలాంటి యాప్‌ల ప్రభావం గురించి హెచ్చరిస్తున్నారు. “ఇంటర్నెట్ యుగంలో గోప్యత అనే ముసుగులో అనైతిక సంబంధాలను ప్రోత్సహించే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాదు, కుటుంబ వ్యవస్థనే దెబ్బతీసే ప్రమాదం ఉంది” అని ఒక సైబర్ ఎక్స్‌పర్ట్ హెచ్చరించారు. మొత్తానికి ఇలాంటి యాప్ లు జీవితాలను తలకిందుల చేసే ప్రమాదం ఉదని చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందా లేదా అనేది తెలియదు. కానీ, సామాజిక మాధ్యమాల్లో దీనిపై చర్చలు మాత్రం ఉధృతంగా సాగుతున్నాయి. సమాజం విలువల పతనం గురించి వచ్చే హెచ్చరికలకు ఇది మరో ఉదాహరణగా నిలుస్తోంది.
