సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో.. విద్య చుట్టూ కనీ వినీ ఎరుగని రీతిలో అక్రమాలు జరుగుతున్నాయన్నదీ అంతే సత్యం.! ప్రధానంగా ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్య విషయమై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. అందునా, మెడిసిన్ అంటే చిన్న విషయం కాదు. కోటి రూపాయల దాకా పలుకుతోంది సీటు ధర. అధికారికంగా ఈ ధర అయితే లేదు. అనధికారికంగా కొన్ని కళాశాలల్లో ఐదు కోట్ల వరకూ మెడిసిన్ సీటు ధర పలుకుతోంది. మెడిసిన్ వైపు వెళ్ళాలనుకున్నవారందరికీ ఈ విషయమై ఓ స్పష్టత వుంది. తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ సోదాల నేపథ్యంలో, ‘విద్యాసంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయి..’ అని ఐటీ తేల్చిందనే వార్త బయటకు వచ్చింది. నిర్దేశించిన ఫీజుల కంటే అధిక ఫీజులు వసూలు చేసి, ఆ అధిక ఫీజులకు సంబంధించి నగదు చెల్లింపులు చేయించుకుని, వాటిని అక్రమ మార్గంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతున్నారన్నది మల్లారెడ్డిపై వస్తున్న ప్రధాన ఆరోపణ.
సరే, ఈ కేసు ఏమవుతుంది.? అన్నది వేరే చర్చ. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యను అందిస్తున్న కళాశాలలకు వెళ్ళి, అక్కడి విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని క్వశ్చన్ చేస్తే.. ఏ కళాశాల యాజమాన్యం ఎలాంటి బాగోతాలు నడుపుతోందో తెలిసిపోతుంది. కానీ, ఐటీ శాఖ అంత సీన్ ప్రదర్శిస్తుందా.? అంటే ఛాన్సే లేదు. ఎందుకంటే, మెజార్టీ విద్యా సంస్థలు, రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తాయ్. గులాబీ పార్టీ మీద బీజేపీ నజర్ అయ్యింది గనుక, మంత్రి మల్లారెడ్డి వ్యవహారం వెలుగు చూసిందంతే.