ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఉప ఎన్నికల పార్టీ అని పిలిచేవారు. ఆ పార్టీకి ఉప ఎన్నికల్లో ఘనమైన రికార్డు వుంది. దాదాపు ఆ పార్టీ పోటీచేసిన ఉపఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించింది. అలాంటి పార్టీ, ప్రస్తుతం అధికారం చెలాయిస్తున్న పార్టీకి దుబ్బాక ఉప ఎన్నికల భయం పట్టుకుందా అంటే అవుననే చెపుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
అందుకే పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన హరీష్ రావు ని నోటిఫికేషన్ కి ముందే అక్కడ రంగంలోకి దించారని చెపుతున్నారు. అయన కూడా దీనిని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోని ప్రచారం చేస్తున్నాడు. అక్కడి జనాలకు స్వయంగా హరీష్ రావు పోటీచేస్తున్నాడా అనేలా ఆయన ప్రచారం సాగుతుంది. దుబ్బాకలో తెరాస జెండా ఎగరటం అనేది అంత ఈజీగా జరిగేపని కాదు.. బేసిక్ గా అక్కడ కాంగ్రెస్ సానుభూతి పరులు ఎక్కువగా వుంటారు. అదే సమయంలో బీజేపీ నేత రఘునందన్ కూడా దుబ్బాక కేంద్రంగా చాలా రోజులుగా పనిచేస్తూ, పార్టీ తరుపున తన వాయిస్ గట్టిగా వినిపిస్తూ, ప్రతి గ్రామంలో తనకి ప్రత్యేకమైన క్యాడర్ ని ఏర్పరచుకొని ప్రచారం చేస్తున్నాడు. అదే విధంగా తెరాస పార్టీలో టిక్కెట్ కోసం పెద్ద ఎత్తున రభస జరుగుతుంది. దుబ్బాక అంటేనే చెరుకు ముత్యం రెడ్డి అనే పేరు గతంలో ఉండేది. ప్రస్తుతం ఆయన కొడుకు తెరాస టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. టిక్కెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీచేయటనికి సిద్దమనే సంకేతాలు కూడా పంపిస్తున్నాడు.
సొంత పార్టీలోనే అసమ్మతి వర్గాన్ని చల్లబరిచి అందరిని ఒక దారిలో నడిపించి పార్టీ విజయం కోసం పని చేయటం తెరాస ముందున్న అతి పెద్ద సవాలు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే దాని ప్రభావం చాలా ఉంటుంది. వ్యతిరేకత ఇప్పటి నుండే మొదలయ్యే అవకాశం వుంది. అందుకే తెరాస ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా తమ శక్తి మేరకు ఉప ఎన్నికల పోరులో పోరాటం చేస్తుంది. ఉద్యమ పార్టీ, ఉప ఎన్నికల్లో మంచి ట్రాక్ రికార్డు, తెలంగాణ తెచ్చాము అనే పేరు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తుతం అధికారం చెలాయిస్తున్న పార్టీకి ఉప ఎన్నికల భయం పట్టుకుందంటే బాగా ఆలోచించవలసిన విషయమే