తెలుగు ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకానికి ఇక ఎండ్ కార్డు వేయాలని.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ శిల్పకళా వేదిక ఘనంగా మారింది. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు మేల్కొలిపే సందేశం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం యువశక్తితో సాధ్యమైంది. ఇప్పుడు అదే యువశక్తి డ్రగ్స్ వలలో పడుతోందంటే ఇది మనమంతా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. డ్రగ్స్‌కు మన రాష్ట్రంలో స్థానం లేదు. విద్యాసంస్థలైనా, సినిమా రంగమైనా ఎక్కడ డ్రగ్స్ ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.
ఇక ఈ వేదికపై FDC చైర్మన్ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మలయాళ సినిమా పరిశ్రమ ఒక గొప్ప నిర్ణయం తీసుకుందని… ఎవరైనా డ్రగ్స్ వాడితే వారికి ఇకపై ఇండస్ట్రీలో అవకాశాలు ఉండవని స్పష్టం చేసింది. అలాంటి గట్టి నిబద్ధత మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అవసరమన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఇదే దిశగా ముందుకెళ్లాలని తెలిపారు. తాను FDC చైర్మన్‌గా పరిశ్రమ పెద్దలతో మాట్లాడి ఈ నిబంధనను ఇక్కడ అమలు అయ్యేలా చూస్తానని ప్రకటించారు.
తెలుగు చిత్రపరిశ్రమలో గతంలో కొంతమంది ప్రముఖులు డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్ రాజు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డ్రగ్స్‌కు సినిమాల్లో ప్రోత్సాహం లేదన్న స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వాలి. అది యువతలో మెసేజ్‌గా వెళ్లుతుంది అని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, విజయ్ దేవరకొండలు కూడా తమ సందేశాలను యువతతో పంచుకున్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ, నిజానికి హీరో అంటే స్క్రీన్ మీద కాదు, నిజ జీవితంలో ఆరోగ్యంగా ఉండే మనిషే హీరో అన్నారు.. డ్రగ్స్ వల్ల చీకటి బాటలోకి వెళ్లకండి అని అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. జీవితం విలువైనది, దానిని మత్తులో కోల్పోకండి అంటూ యువతను చైతన్యపరిచేలా మాట్లాడారు.