Diamond: ఈ రాశుల వారు వజ్రం ధరిస్తే.. మహా రాణులా బతికేస్తారట..!

రత్న శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాల ప్రభావం మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతారు. వాటిలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేక రత్నం సూచించబడింది. అందులో శుక్ర గ్రహానికి ప్రతీకగా నిలిచేది వజ్రం. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నా, దాని ప్రభావం తగ్గిపోతున్నా, వజ్రం ధరించడం వల్ల శుక్రుడు శక్తివంతమవుతాడని జ్యోతిష్యం చెబుతుంది.

శుక్రుడు అందం, కళ, భోగాలు, వైవాహిక సుఖం, ఫ్యాషన్, సృజనాత్మకత, లగ్జరీ పట్ల ఆకర్షణకు కారణమవుతాడు. కాబట్టి వజ్రాన్ని సరిగా, నియమాలు పాటిస్తూ ధరించడం వల్ల ఈ రంగాల్లో విజయాలు సాధించడం సులభం అవుతుంది. ఇక వృషభం, మిథునం, కన్య, తులా, కుంభ రాశి వారు లేదా శుక్రుని మహాదశలో ఉన్నవారు వజ్రాన్ని ధరించడం అనుకూలమని నమ్మకం.

అయితే శుక్రుడు బలహీనంగా ఉంటే.. కొన్ని రత్నాలు ధరించరాదని పండితులు హెచ్చరిస్తున్నారు. వజ్రం ధరించిన వారు వ్యక్తిత్వంలో ఆకర్షణ, ఆత్మవిశ్వాసం, విలాసవంతమైన జీవనశైలిని పొందుతారని అంటారు. మీడియా, సినిమాలు, ఫ్యాషన్ డిజైనింగ్, కళా రంగంలో ఉన్నవారికి ఇది మరింత శుభప్రదమని పండితులు అంటున్నారు.

వజ్రాల్లో రష్యా వజ్రాలు ఉత్తమమైనవిగా పేరుగాంచాయి. ఖరీదైనవి కావడంతో సాధారణంగా 0.50 నుండి 2 క్యారెట్ల వరకు వజ్రాలను ఎంచుకోవచ్చు. ఉంగరం కోసం బంగారం లేదా వెండి లోహం ఉత్తమం. ధరించే సమయానికి శుక్లపక్ష శుక్రవారం ఉదయం సూర్యోదయం తరువాత ముహూర్తం అనుకూలం. వజ్రాన్ని ధరించే ముందు పాలు, గంగాజలం, తేనె, చక్కెరతో శుద్ధి చేసి, శుక్రుడి పూజ అనంతరం ధరించాలి. ఏదైనా ఆలయంలో ఆ ఉంగరాన్ని ఉంచి పండితులు లేదా పూజారుల ఆశీస్సులు తీసుకొని ధరించడం శుభప్రదం. ఇలాచేస్తే శుక్ర గ్రహం ప్రసన్నమై భోగాలు, అందం, సుఖసమృద్ధి ప్రసాదిస్తాడని జ్యోతిష్యం చెబుతుంది.