హాట్ టాపిక్… కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక అసలు కారణాలివేనా?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిత్రులను తమలపాకుతో రుద్దుతూ, శత్రువులను తలుపుచెక్కతో కొడుతున్నారని.. అందుకు సీబీఐ, ఈడీలను పుష్కలంగా వాడుకుంటున్నారని.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు స్టార్ అయినా అక్కడకి ముందుగా ఈడీ వస్తుందని, తర్వాతే మోడీ వస్తారని రకరకాల విమర్శలు గతకొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసింది. ఈ సమయంలోనే వాషింగ్ పౌడర్ నిర్మా అనే సెటైర్ కూడా బీజేపీకి తగిలించారు.

ఎవరు ఎంత అవినీతిపాల్పడినా, ఎన్ని కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టినా, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా.. వారంతా బీజేపీలో చేరి కాషాయం కండువా కప్పుకోగానే తెల్లగా, పవిత్రులుగా మారిపోతారని వెటకారంగా వాషింగ్ పౌండర్ నిర్మా అనే సెటైర్ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఈ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడంతో మరోసారి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి వైరల్ గా మారిందని అంటున్నారు.

అవును… సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన ప్రతిపక్షాలను దెబ్బకొట్టే రీతిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు చెలరేగిపోతున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపచేయడం, బీఆరెస్స్ అధినేత కేసీఆర్ కుమార్తె ను అరెస్ట్ చేయడంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో… ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ను మద్యం కుంభకోణంలో అరెస్టు చేశారు.

పైన చెప్పుకున్న మూడు అంశాల్లో కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు స్తంభింపచేయడం అత్యంత దారుణం అన్నట్లుగా వినిపిస్తున్న మాటల సంగతి కాసేపు పక్కనపెడితే… ఢిల్లీ లిక్కర్ స్కాం అంశం ఈనాటిదైతే కాదనే చెప్పాలి. ఆ వ్యవహారం ఎప్పుడో బయటకు వచ్చినప్పటికీ… ఇన్ని రోజులూ నాన్చి ఇప్పుడు ఎన్నికల ముందు అరెస్టులకు రంగం సిద్ధం చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.

వాస్తవానికి… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు “ఇండియా” కూటమిలో ఉన్న వారిలో అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అని అంటున్నారు. బీజేపీ తరహాలోనే హిందుత్వ అజెండా ఎత్తుకుంటూనే… బీజేపీని ఇరుకునపెట్టడంలో కేజ్రీవాల్ దిట్ట అని చెబుతారు. దీంతో… కాంగ్రెస్ కంటే ఎక్కువగా ఇప్పుడు బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా కేజ్రీవాల్ మారారనే చర్చ జాతీయ రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తుంది.

ఇదే క్రమంలో… ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఢిల్లీ, పంజాబ్‌ ల్లో అధికారంలో ఉండగా.. హరియాణా, గుజరాత్‌ ల్లోనూ బాగానే విస్తరించింది. గత ఎన్నికల్లో గుజరాత్ లో సాలిడ్ గా 10శాతం వరకూ ఓట్లు కొల్లగొట్టుకో గలిగింది. ఫలితంగా నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది బీజేపీకి ప్లస్ అయినప్పటికీ… లాంగ్ లైఫ్ లో బీజేపీకి ఆప్ అతిపెద్ద సమస్య కాబోతుంది. ఇక వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో పంజాబ్‌ లో అన్ని స్థానాల్లోనూ ఆప్‌ పోటీ చేస్తోంది.

ఇదే క్రమంలో… ఢిల్లీ, హరియాణా, గుజరాత్‌ ల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో… ఈసారి ఈ రాష్ట్రాల్లో ఆప్‌ మంచి ఫలితాలు సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ విషయం బీజేపీ పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని అంటున్నారు!! ఈ సమయంలో.. ఆప్ కు ఉన్న ప్రధాన నేత అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే కావడంతో… ప్రచారానికి అవకాశం లేకుండా ఆయననే అరెస్ట్ చేయాలనే ఆలోచన చేశారనే చర్చా తెరపైకి వచ్చింది. మరి దేశప్రజలు ఈ విషయాలను ఏ విధంగా ఆలోచిస్తారనేది వేచి చూడాలి!