సీపీఐ అగ్రనేత, సీనియర్ రాజకీయవేత్త కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డికి రాజకీయ ప్రముఖులు, ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని మగ్దూం భవన్‌లో ఉంచిన ఆయన పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు మంత్రులు, నాయకులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుష్పాంజలి ఘటించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. సురవరం మృతి కమ్యూనిస్టు ఉద్యమానికే కాక, సమాజానికి తీరని లోటు అని వారు అభిప్రాయపడ్డారు.
లాల్ సలామ్ కామ్రేడ్: సీఎం రేవంత్ రెడ్డి
సురవరం భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, సంతాప సందేశంలో “లాల్ సలామ్ కామ్రేడ్” అని రాశారు. ఆయన మాట్లాడుతూ, “పాలమూరు జిల్లాకు సురవరం గారు వన్నె తెచ్చారు. అధికారం ఉన్నా లేకపోయినా, జీవితకాలం సిద్ధాంతాలకే కట్టుబడిన గొప్ప నేత. ఆయన జ్ఞాపకార్థం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. కేబినెట్‌లో చర్చించి తగిన కార్యాచరణ రూపొందిస్తాం” అని హామీ ఇచ్చారు.
సమాజానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, సురవరంతో తనకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలున్నాయని గుర్తుచేసుకున్నారు. “సుధాకర్‌రెడ్డి మరణం సీపీఐకే కాదు, యావత్ సమాజానికి తీరని లోటు. ఆయన చేపట్టిన ఉద్యమాలు, సేవా కార్యక్రమాలు చిరస్మరణీయం” అని కొనియాడారు.
ప్రముఖుల నివాళులు:
వెంకయ్యనాయుడు (మాజీ ఉపరాష్ట్రపతి): “నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు సురవరం పనిచేశారు. ఆయన ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలిచి పోరాడారు” అని అన్నారు.
కేటీఆర్ (బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్): “జాతీయ స్థాయిలో సురవరంతో కలిసి పనిచేసే అవకాశం మాకు లభించింది. ఆయన లేని లోటు పూడ్చలేనిది” అని పేర్కొంటూ, కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ తరఫున కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఆర్. నారాయణమూర్తి (నటుడు, దర్శకుడు): “విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సురవరం ఎంతో పోరాడారు. ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడంలో ఆయన పార్లమెంట్‌లో కీలక పాత్ర పోషించారు” అని గుర్తుచేసుకున్నారు.
వీరితో పాటు సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు డి. రాజా, ఎం.ఎ.బేబీ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సురవరానికి నివాళులర్పించారు.
గాంధీ మెడికల్ కాలేజీకి పార్థివదేహం
మగ్దూం భవన్‌లో ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ఉంచిన అనంతరం, సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గాంధీ మెడికల్ కాలేజీ వరకు కొనసాగింది. ఆయన ఆశయం మేరకు, పరిశోధనల కోసం పార్థివదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఆయన కళ్లను ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు.




