కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఓ స్పష్టతనిచ్చేసినా, ‘అధికారంలోకి మేమే వస్తాం..’ అని కమలనాథులు చెప్పుకొచ్చారు. ఓ వైపు ఫలితాలు వెల్లడవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. అయినాగానీ, ‘అధికార పీఠమెక్కేది మేమే..’ అని బీజేపీ నేతలు చెప్పడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.

క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయ్.! కానీ, కర్నాటకలో హంగ్ ఏర్పాటుకు అవకాశం లేకపోయింది. స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాంతో, కర్నాటకలో కాంగ్రెస్ జెండా సగర్వంగా ఎగిరినట్లయ్యింది.

నిజానికి, కర్నాటకలో హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని చాలామంది భావించారు. అయితే, కర్నాటక ప్రజలు మాత్రం స్పష్టమైన తీర్పునే ఇచ్చారు. బీజేపీకి మరీ దారుణమైన ఓటమి ఏమీ కాదుగానీ, దెబ్బ మాత్రం చాలా చాలా గట్టిగానే తగిలింది.

దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, అక్కడ ప్రధాని మోడీ ‘వాలిపోవడం’ సర్వసాధారణమైపోయింది. ‘మోడీ గెలిపించారు..’ అని ఆయా రాష్ట్రాల్లో బీజేపీ చెప్పడం చూశాం. ‘గెలిచిన మోడీ..’ అంటూ ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలపై బీజేపీ వెటకారం చేయడం మామూలే.

మరిప్పుడు, ప్రధాని మోడీ కర్నాటకలో ఓడిపోయినట్లేనా.? అలాగే అనుకోవాలేమో.! రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయించడం అన్నది బీజేపీకి ‘ఆత్మహత్యా సదృశమే అయ్యింది’ అనే మాట ప్రముఖంగా వినిపిస్తోందిప్పుడు.