స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిన్నమొన్నటి వరకూ బాబు అరెస్ట్ అక్రమం, కక్ష సాధింపు చర్యలో భాగం అని వినిపించిన కామెంట్ల నడుమ ఇప్పుడు సరికొత్త కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే… జైల్లో చంద్రబాబు సౌకర్యాలు, ప్రాణహాని అరోపణలు!
అవును… గతంలో చంద్రబాబు అరెస్ట్ అక్రమం, రాజకీయ కక్ష సాధింపులో భాగం అంటూ బలంగా వినిపించిన కామెంట్ల నడుమ ఇప్పుడు జైల్లో సౌకర్యాలు బాగా లేవు, దోమలు కుడుతున్నాయి, ఫలితంగా డెంగ్యూ వస్తుంది, ఆ విధంగా బాబుని చంపాలని చూస్తున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… “చంద్రబాబు మరణం దోమకాటుతో అని రాసుందా” అనే ప్రశ్నలు ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నాయి.
సాధారణంగా పాత సినిమాల్లో శాపాలు పెట్టే, వరాలు ఇచ్చే సన్నివేశాలు కనిపిస్తుంటాయి. పాముకాటుతో తప్ప నీకు మరో రూపంలో మరణం సంభవించదు అని.. ఫలానా వారి వల్ల తప్ప నీకు మరణం సంభవించదని.. నువ్వు కోరుకుంటే తప్ప నీకు మరణం రాదని.. రకరాకాల వెర్షన్స్ లో శాపాలతో కూడిన వరాలు.. వరాలతో కూడిన శాపాలు కనిపిస్తుంటాయి.
ఆ స్థాయిలో.. చంద్రబాబుకు దోమకాటుతో మరణం సంభవించేలా ఉందని, ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని అంటున్నారు లోకేష్! ఇందులో భాగంగా తాజాగా ఆయన ఒక ట్వీట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక రిమాండ్ ఖైదీ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ వచ్చి మరణించాడని.. అదేరకంగా చంద్రబాబును చంపేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారనే అనుమానం బలపడుతుందని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో చంద్రబాబు నాయుడుకి దోమల నుండి రక్షణ లేదని.. జైలులో దోమల బెడద ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేసినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో… ఏకంగా జైల్లో దోమలతో కుట్టించి, తద్వారా డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారన్నట్లుగా, ఫలితంగా బాబు చావుకు ప్లాన్ చేస్తున్నారన్నట్లుగా లోకేష్ రియాక్ట్ అవ్వడం వైరల్ గా మారింది.
అయితే ఈ ఆరోపణలు, అనుమానాలపై స్వయంగా జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు. జైలులో దోమల నివారణకు సంబంధిత శాఖతో కలిసి చర్యలు చేపట్టామని.. రెగ్యులర్ గా ఫాగింగ్ చేస్తున్నామని.. జైలులో దోమల లార్వా ఆనవాళ్లేమీ లేవని తెలిపారు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… దోమ కాటు, డెంగ్యూ జ్వరంతో చంద్రబాబు చనిపోవాలని జగన్ కుట్ర చేస్తున్నాడని.. టీడీపీ అధినేతకు ఏదైనా జరిగితే జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని.. అందుకే బాబుకు బెయిల్ రాకుండా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని.. లోకేష్ చెప్పడం!
అంటే… చంద్రబాబుకు బెయిల్ రాకపోతే అది ఆయనను దోమలతో చంపేందుకేనా?.. అని అంటే అది పొరపాటే! బెయిల్ ఇచ్చేది న్యాయస్థానమే కానీ ప్రభుత్వం కాదు! చంద్రబాబుకు దోమకాటుతో ప్రాణహాని ఉందా?.. అని అంటే.. ప్రభుత్వం అంతవరకూ రానివ్వదని అంటున్నారు! కారణం… వాస్తవాలు బయటకు రాబట్టాలని, ప్రజాధనాన్ని కాపాడాలనేదే ప్రభుత్వ ప్రయత్నమే తప్ప, బాబు ప్రాణాలకు ఆపద కలిగించాలని కాదు కదా అనేది పరిశీలకుల సమాధానం!!
స్కిల్ డెవలప్ మెంట్ లో స్కాం జరిగిందా.. జరిగితే అందులో బాబు పాత్ర ఎంతుంది.. పాత్ర ఉంటే శిక్ష ఎంత పడుతుంది.. పాత్రలేకుంటే క్వాష్ పిటిషన్ ఓకే అయిపోతుంది! ఇది పూర్తిగా అటు సీఐడీ న్యాయవాదులు – చంద్రబాబు తరుపున ఉన్న న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ జగన్ కక్షగట్టడానికీ, దోమలు ఆయుధాలుగా మారడానికి స్కోప్ ఎక్కడ ఉంది..? అనేది విమర్శకుల అభిప్రాయం!