మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించి నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు, గ్రామాలు జలమయం కావడంతో పాటు పలుచోట్ల రహదారులు తెగిపోయి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం: తుపాను బీభత్సంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చలి తీవ్రత, వరదల్లో పడిపోవడం, గోడలు కూలడం వంటి కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందారు.
నెల్లూరు జిల్లా: మనుబోలు మండలం గొట్లపాళెంలో పొట్టేళ్లవాగులో పడి జయమ్మ అనే వృద్ధురాలు మృతి.
బాపట్ల జిల్లా: అద్దంకి ఎన్టీఆర్ నగర్‌లో చలి తీవ్రతకు రేఖానార్ లక్ష్మి(61), హనుమంతరావు(84) మృతి.
కృష్ణా జిల్లా: కొబ్బరిచెట్టు మీద పడటంతో కృత్తివెన్ను మండలానికి చెందిన సుబ్బారావు (54) చికిత్స పొందుతూ మరణం; గంగూరుకు చెందిన వనం అన్నపూర్ణ(64) చలిగాలుల తీవ్రతను తట్టుకోలేక మృతి.
పల్నాడు జిల్లా: వినుకొండలో మర్రెడ్డి రాములమ్మ (90) ఇంటి మట్టి గోడ కూలి మృత్యువాత.
ఉమ్మడి కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు గల్లంతయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా 304 మండలాలు, 1,825 గ్రామాల్లో 87 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఇందులో 59 వేల హెక్టార్లకు పైగా వరి పంట నీట మునిగింది. పత్తి, మొక్కజొన్న, మినుము వంటి ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. మొత్తం 78,796 మంది రైతులు నష్టపోయారు. 42 పశువులు మృత్యువాత పడ్డాయని అధికారులు తెలిపారు. అయితే, వాస్తవ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రజలను, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది.
పంట నష్టాలపై ఐదు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం వ్యవసాయ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి గురువారం నాటికల్లా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయాలని ఆదేశించారు.

నిత్యావసరాలు & ఆర్థిక సాయం: బాధితుల్లో ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం (మత్స్యకారులకు 50 కిలోలు), 1 కిలో కందిపప్పు, 1 లీటర్ నూనె, 1 కిలో ఉల్లిపాయలు, 1 కిలో బంగాళాదుంపలు, 1 కిలో చక్కెర పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇతర కూరగాయల సరఫరా బాధ్యతలను మార్కెటింగ్ కమిషనర్‌కు అప్పగించారు.
బాధితుడికి రూ.1000 చొప్పున ఆర్థిక సహాయం, కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ ఉన్నా గరిష్ఠంగా రూ.3 వేలు అందించాలని నిర్ణయించారు. విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ పనులను తక్షణమే పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య పనులు ముమ్మరం చేసి డ్రైనేజీలను శుభ్రం చేయాలని స్పష్టం చేశారు. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులను యధావిధిగా కొనసాగించాలని సూచించారు.

