రోడ్లపైకొచ్చిన చిరు అభిమానులు… లాజిక్ మిస్సంటూ సెటైర్లు!

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, కొంతమంది ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ మంత్రులు బొత్స సత్యన్నారాయణ, రోజా, అమర్నాథ్ లతోపాటు మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఫైరయైన సంగతి తెలిసిందే.

వీరితోపాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు చిరంజీవిపై ఫైరయ్యారు. దీంతో చిరంజీవిపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. చిరంజీవిని ఉద్దేశించి పగోడీగాళ్లు అన్నారంటూ నిసరన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిరంజీవి, పవన్ కల్యాణ్ లు బురదజల్లుతుంటారు… ప్రభుత్వ పెద్దలు భరించాలన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారన్నట్లుగా పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పకోడీగాళ్లు అంటూ ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో… కృష్ణా జిల్లా గుడివాడలో చిరంజీవి అభిమానులు ఆందోళనకు దిగారు. “జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌ డౌన్‌ ” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా… చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అభిమానులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

చిరంజీవికి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో చిరు అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో… చిరంజీవి యువత అధ్యక్షుడు, పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసినవారిని తరలిస్తున్న పోలీసు వాహనాలకు అడ్డంగా చిరంజీవి అభిమానులు పడుకుని నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఇదే సమయంలో విజయవాడ మెయిన్‌ రోడ్డుపై చిరంజీవి అభిమానులు బైఠాయించారు. వంగవీటి మోహనరంగా విగ్రహానికి క్షీరాభిషేకాలు చేశారు. ఈ ఆందోళనల్లో జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. చిరుకు అనుకూలంగా.. కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వంపై అవాకులూ చెవాకులూ పేలినవారిపై కొడాలి నాని ఫైరవ్వడానికీ, వంగవీటి రంగా విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి గల లాజిక్కుల సంగతి కాసేపు పక్కన పెడితే.. కులం రంగు పులుముతున్నారంటూ మరికొంతమంది ఫైరవుతున్నారు.

కాగా… ఏపీ ప్రభుత్వం పై చిరంజీవి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని మచిలీపట్నంలో స్పందించారు. ఈ సందర్భంగా కాస్త ఘాటుగానే స్పందించారు. ఇందులో భాగంగా… “సినిమా పరిశ్రమలోని పకోడిగాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఎలా ఉండాలనే సలహాలు ఇస్తున్నవారు.. నటులు పరిశ్రమకే సేవలందిస్తూ సినిమాలు, ఫైట్స్‌, డ్యాన్స్‌, యాక్షన్ చేసుకోవాలంటూ వారికి కూడా సలహా ఇస్తే మేలని అన్నారు. మరోపక్క… తమ్ముడిని వెనకేసుకొచ్చే విషయంలో చిరు తొందరపడ్డారని, ఫలితంగా గౌరవం పాడుచేసుకుంటున్నారని, దానికి తోడు అభిమానులం అని చెప్పుకునే వారి అత్యుత్సాహాలు మరింత చర్చకు దారితీస్తున్నాయని, తద్వారా డ్యామేజీ వైశాల్యం పెరుగుతుందని అంటున్నారు.