జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవబోతున్నారా.? సహాయ మంత్రి పదవి కాకుండా కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ పవన్ సొంతమయ్యేలా మెగాస్టార్ చిరంజీవి తెరవెనుకాల పావులు కదుపుతున్నారా.? ఏమోగానీ, రాజకీయ వర్గాల్లో మాత్రం చిరంజీవి చుట్టూ ఆసక్తికరమైన ఊహాగానాలు సందడి చేస్తున్నాయి. చిరంజీవిని రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రిని చేయాలనే ఆలోచన బీజేపీకి వుంది. కానీ, చిరంజీవి అందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఎందుకంటే, చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వున్నారు.. సినీ పరిశ్రమలో పెద్దన్నగా తనదైన గౌరవాన్ని పొందుతున్నారు.
ఇక, పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. జనసేన అధినేతగా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్న పవన్ కూడా సినిమాల్లో బిజీగా వున్నప్పటికీ, రాజకీయ తెరపై వెలిగిపోవాలన్నది పవన్ ఉద్దేశ్యం. ఎటూ పవన్, బీజేపీతో సన్నిహితంగా వుంటున్నారు. బీజేపీ కూడా, పవన్ ఒప్పుకుంటే ఆయన్ని కేంద్ర మంత్రిని చేయాలనుకుంటోంది. అయితే, సహాయ మంత్రి పదవి మాత్రమే పవన్ కోసం బీజేపీ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవికి, ఢిల్లీ రాజకీయాలెలా వుంటాయో బాగా తెలుసు. ఆ అనుభవంతోనే, పవన్ కళ్యాణ్ చుట్టూ చిరంజీవి పక్కా ప్లాన్ వేశారని తెలుస్తోంది. తన సోదరుడ్ని ఉన్నత స్థానంలో చూడాలనుకుంటున్న చిరంజీవి, పవన్ క్యాబినెట్ ర్యాంకుతో కేంద్ర మంత్రి అయితే, ఆ పవర్ వేరేలా వుంటుందన్నది చిరంజీవి యోచనగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ విషయంలో క్యాబినెట్ ర్యాంక్.. అలాగే కీలక మంత్రిత్వ శాఖను ప్రధాని మోడీ ఆఫర్ చేస్తే, 2024 ఎన్నికల్లో బీజేపీ తరఫున చిరంజీవి ప్రచారం చేయడానికీ సిద్ధమేనంటూ ఓ లీక్ బయటకు వచ్చింది. కానీ, ఇందులో ఎంత నిజమన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
మెగా కాంపౌండ్ అయితే, చిరంజీవి అస్సలేమాత్రం రాజకీయ వ్యవహారాల గురించి ఆలోచించడంలేదనే చెబుతోంది. పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర మంత్రి పదవి గురించి అంతలా ఆలోచించడంలేదట. బీజేపీ మాత్రం అటు పవన్, ఇటు చిరంజీవితో మంతనాలు జరుపుతూనే వుందటన్నది సినీ, రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్న ప్రచారం తాలూకు సారాంశం.