HMPV Virus: న్యూ వైరస్ కలకలం.. చైనా ఏం చెప్పిందంటే..

చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) వ్యాప్తిపై వస్తున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా ద్వారా వైరస్ వ్యాప్తి కారణంగా ఆసుపత్రులు రద్దీగా మారాయని అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ సమాచారం పూర్తిగా నిరాధారమని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. శీతాకాలంలో సాధారణంగా శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వస్తాయని, కానీ వాటిని అనవసరంగా వైరస్‌తో కట్టిపెట్టడమేంటని చైనా ఆరోపించింది.

చైనాలో కొత్త వైరస్ వ్యాప్తి లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. వారు నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలు పాటిస్తున్నామని, ప్రజల ఆరోగ్యానికి గరిష్ఠ ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. కొత్త వైరస్‌పై వస్తున్న వార్తలను దుష్ప్రచారంగా అభివర్ణించిన చైనా, ఆ కథనాల వెనుక ఉన్న ఉద్దేశాలను ప్రశ్నించింది.

హెచ్ఎంపీవీ లక్షణాలు సాధారణ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల మాదిరిగా ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. జలుబు, దగ్గు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు వైరస్ బారిన పడ్డ వారిలో కనిపిస్తాయని చెప్పారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఈ వైరస్‌కు ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధికి నిర్దిష్టమైన టీకా లేకపోవడంతో, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అపోహలకు లోనుకాకుండా జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత కాపాడుకోవాలని చైనా ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ తగిన చర్యలతో చైనాలోని ప్రజల ఆరోగ్యం సురక్షితంగానే ఉందని స్పష్టం చేసింది. ప్రజలు అవగాహనతో ఉండి, అనవసరమైన ప్రచారాలకు భయపడవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.