కుక్కని మనిషి చంపితే నేరం.! మనిషిని కుక్క చంపితే.!

ఎక్కడన్నా ఎవరన్నా ఓ కుక్కని చంపాడంటే.. అదో పెద్ద జాతీయ సమస్య అయిపోతుంటుంది.! సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు స్పందించేస్తుంటారు. ‘ఆ మానవ మృగాల్ని కఠినంగా శిక్షించాలి.. ’ అని డిమాండ్ చేసేస్తుంటారు నెటిజనం.. అదే విధంగా సెలబ్రిటీ జనం కూడా.! ఔను, కుక్కని మనిషి చంపితే నేరం.! మరి, మనిషిని కుక్క చంపితే.? అది జంతువు.. దాన్ని ఎలా శిక్షించగలం.? ఛాన్సే లేదు.! రాజకీయాల్లో తరచూ ఈ మాట మాట్లాడుతుంటారు. కుక్కని చంపాలంటే, దాని మీద పిచ్చికుక్క అనే ముద్ర వేయాలని. అలాంటి సందర్భాల్లో మాత్రమే కుక్కని చంపితే అది నేరం కాదు మరి.!

కుక్క అనే కాదు, ఏ జంతువు విషయంలో అయినా ఇదే వర్తిస్తుంది. పులి, సింహం.. వంటి క్రూర మృగాలు అడవి దాటి, మనుసుల్ని చంపేందుకు జనారణ్యంలోకి వస్తే.. వాటిని కాల్చి చంపుతుంటారు. అదీ విధిలేని పరిస్థితుల్లో మాత్రమే.! విశ్వనగరం హైద్రాబాద్‌లో ఓ నాలుగేళ్ళ చిన్నారిని కుక్కలు చంపేశాయ్.! దాంతో, మళ్ళీ ‘కుక్కని మనిషి చంపితే నేరమంటారు.. మరి, మనిషిని కుక్క చంపితే.?’ అన్న ప్రశ్న తెరపైకొచ్చింది.

‘ఆకలి బాధతోనే కుక్కలు అలా చేస్తాయ్..’ అంటారు కొందరు. ఇతరత్రా సమస్యలూ కుక్కలు మనుషుల మీద దాడి చేసి చంపేయడానికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. వీధి కుక్కల విషయంలో ప్రభుత్వాలు ఎంత చెయ్యగలో అంతా చేస్తాయ్. చిన్నా చితకా నిర్లక్ష్యాలు ఎక్కడైనా మామూలే. అవే అతి ఖరీదైన తప్పిదాలుగా మారతాయ్.