Chandrababu: కార్మికుల సంక్షేమంపై చంద్రబాబు ముద్ర.. రూ. కోటి బీమా పథకం ప్రారంభం

Chandrababu: రాష్ట్రంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కార్మికులకు మరియు వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ కోటి రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించే బృహత్తర పథకాన్ని శనివారం పెద్దాపురంలో లాంఛనంగా ప్రారంభించారు. “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.

రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి. దీని కోసం ఇరు వర్గాల మధ్య అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. ఇప్పటికే మున్సిపల్ కార్మికుల కోసం ప్రత్యేక శాలరీ ప్యాకేజ్ ఖాతాలను కూడా ప్రారంభించారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలలో పనిచేస్తున్న 55,686 మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. శాశ్వత, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా కార్మికులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

పథకం యొక్క ప్రధాన ప్రయోజనాలు: ఈ నూతన బీమా పథకం ద్వారా కార్మికులకు అసాధారణమైన ఆర్థిక భద్రత లభించనుంది.

శాశ్వత ఉద్యోగులకు:
ప్రమాద బీమా: రూ. 1 కోటి వరకు.
లైఫ్ కవర్: రూ. 10 లక్షలు.

ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు:
ప్రమాద బీమా: రూ. 20 లక్షలు.
లైఫ్ కవర్: రూ. 2 లక్షలు.

అదనపు ప్రయోజనాలు: 
విద్యా సహాయం: ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే, వారి పిల్లల చదువు కోసం గరిష్ఠంగా రూ. 8 లక్షల వరకు ఆర్థిక సహాయం.
ఆరోగ్య బీమా: కుటుంబ సభ్యులతో సహా రూ. 33 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం.
కుటుంబ సభ్యులకు బీమా: కార్మికుల కుటుంబ సభ్యులు జీరో బ్యాలెన్స్ ఖాతా తెరిస్తే, వారికి కూడా రూ. 15 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తమ జీవితాల్లో గొప్ప భరోసా నింపుతుందని మున్సిపల్ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Amaravati Public Reaction On Heavy Rains || Ap Public Talk || Chandrababu || YsJagan || TeluguRajyam