సొంత నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల్ని ఎదుర్కోలేక చతికిలపడటమంటే అంతకన్నా ఘోర పరాభావం ఇంకేముంటుంది.? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిది ఇదే పరిస్థితి. నియోజకవర్గంలో పార్టీ భ్రష్టుపట్టిపోయిన వైనాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన చంద్రబాబు, ఎట్టకేలకు డ్యామేజీ కంట్రోల్ చర్యలకు శ్రీకారం చుట్టారు. అయితే, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం తప్ప, నియోజకవర్గంలో టీడీపీ తిరిగి పుంజుకునే అవకాశమే లేదన్నది స్థానికంగా వినిపిస్తోన్న మాట. ‘ఏ పార్టీ అయినా, ఎన్నికల సమయంలో అది చేస్తామనీ, ఇది చేస్తామని చెబుతుంది. కానీ, పంచాయితీ ఎన్నికల్లో సంక్షేమ పథకాల్ని తొలగిస్తామని అధికార పార్టీ బెదిరింపులకు దిగింది.. అదే మా ఓటమికి కారణం..’ అంటూ చిత్ర విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు కుప్పం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు. ఏళ్ళ తరబడి నియోజకవర్గాన్ని చంద్రబాబు పట్టించుకోకపోవడమే కుప్పం నియోజకవర్గంలోనూ, చిత్తూరు జిల్లాలోనూ టీడీపీకి ఎదురవుతున్న ఘోర పరాభవాలకు కారణంగా చెప్పుకోవచ్చు. కానీ, ఇప్పటికీ తప్పు తెలుసుకునే స్థితిలో చంద్రబాబు లేరు.
ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలతో సరిపెడతామంటే ఎలా.? రాజకీయాల్లో రాజకీయ విమర్శలు మామూలే. అదే సమయంలో, పార్టీ బలోపేతంపైనా దృష్టిపెట్టాల్సి వుంది. ఇప్పటికీ టీడీపీకి ఆ కాస్త క్యాడర్ వుందంటే.. అది స్వర్గీయ ఎన్టీయార్ మీద ప్రజల్లో వున్న గౌరవం తప్ప, చంద్రబాబు తనంతట తానుగా తెచ్చుకున్న ఫాలోయింగ్ కానే కాదు. 2019 ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని చవిచూసిన టీడీపీ, తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమతయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, ఇప్పటికీ ఓటమి నుంచి చంద్రబాబు పాఠాలు నేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు గనుక. 2024లో జరిగే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంకి టాటా చెప్పేసి, తన కుమారుడు లోకేష్ లాగనే అమరావతి పరిధిలో ఇంకో నియోజకవర్గం ఏదన్నా చూసుకుంటారేమో.!