గత ఎన్నికల్లో భారీ ఓటమిని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీకి ప్రజల్లోకి వెళ్లడానికి అవకాశం చిక్కడం లేదు. కరోనా కారణంగా మార్చి చివరివారం నుండి ప్రజల్లోకి వెళ్లలేదు. లాక్డౌన్ తర్వాత కూడా ఈ మహమ్మారి వల్ల ప్రజల్లోకి పూర్తిగా వెళ్లలేని పరిస్థితి. మూడు రాజధానుల అంశం నుండి జగన్ ప్రభుత్వానికి వరుసగా కోర్టు మొట్టికాయలు వరకు వివిధ అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నప్పటికీ, అది ఆశించినమేరకు లేదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నుండి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధ్యక్షుడిని మార్చాలని భావిస్తున్నారు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను బలంగా వినిపించేవాడితో పాటు ప్రజలను ఆకట్టుకునే వారు కావాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు. ఈ పదవికి గతంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు పేర్లు వినిపించాయి. అయితే అచ్చెన్నకు పదవి దాదాపు ఖాయమైందని వార్తలు వస్తున్నాయి. ఈ నియామకం వెనుక చంద్రబాబు నాయుడు భారీ స్కెచ్ ఉండవచ్చునని అంటున్నారు.
అచ్చెన్నాయుడుకి బాధ్యతల వెనుక బాబు భారీ వ్యూహం
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదలు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి వరకు జగన్‌పై, వైసీపీపై అచ్చెన్నాయుడు ఎప్పుడూ తగ్గలేదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అవినీతి కేసులు పల్లెవేస్తూ, సభలో ఘాటుగా సమాధానం చెప్పేవారు. ప్రతిపక్షంలోను ఇదే వైఖరి కొనసాగుతోంది. అధ్యక్ష పదవికి చంద్రబాబు నాయుడు అనేక లెక్కలు వేసుకుంటారు. ఈ కోణంలో ప్రస్తుత పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, చెబుతూ అందుకు కారణాలు కూడా చూపెడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్‌కు, వైసీపీకి, ప్రభుత్వంపై ధీటుగా స్పందించేవారిలో అచ్చెన్న ముందు ఉంటారు.
ఇటీవల ఈఎస్ఐ స్కాంలో ఆయన అరెస్టు కలకలం రేపింది. కుట్రపూరితంగానే ఈ అరెస్టు జరిగిందని తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకు వెళ్లింది. కొద్ది రోజులు జైల్లో ఉన్నారు. ఇటీవలే బెయిల్ పైన బయటకు వచ్చారు. ఈ స్కాంలో అచ్చెన్నకు సంబంధం లేదని, ఆయనకు ఏదో ముట్టినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని, ఇప్పటికే ఇది ప్రజల్లోకి వెళ్లిందని, కాబట్టి ఆయన దూకుడుకు, ఈ సానుభూతి కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇతర అంశాల విషయానికి వస్తే మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. కిమిడి కూడా ఉత్తరాంధ్రకు చెందినవారు. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకుంటే అచ్చెన్నాయుడికి అవకాశాలు ఎక్కువ అంటున్నారు. పైగా బీసీ కీలక నాయకుడు. తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
‘జూ.ఎన్టీఆర్‘ కోసం ఆరాటం
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగిస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయట. 2011-12లోనే చంద్రబాబు వారసుడిగా లోకేష్, జూ.ఎన్టీఆర్ పేర్లు తెరపైకి వచ్చాయి.
తనయుడికి ప్రాధాన్యత ఇవ్వడంతో జూనియర్ రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి కాస్త దూరం జరిగినట్లుగా చెప్పవచ్చు. గతంలో ఏపీ బాధ్యతలు లోకేష్, తెలంగాణ బాధ్యతలు జూ.ఎన్టీఆర్‌కు అప్పగించాలనే వాదనలు వినిపించాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ , పవన్ కళ్యాణ్ వంటి వారిని ధీటుగా ఎదుర్కోవడానికి జూ.ఎన్టీఆర్ మాత్రమే సరైన వ్యక్తిగా చాలామంది భావిస్తున్నారట. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు వద్ద చెప్పే ధైర్యం చేయడం లేదని అంటున్నారు.
జూ.ఎన్టీఆర్ వస్తే ఆ కిక్ వేరు
ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించడంతో పాటు వారసుడిగా జూ.ఎన్టీఆర్‌ను తెరపైకి తీసుకు వస్తే తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం పెరుగుతుందని భావిస్తున్నారట.
అచ్చెన్నాయుడు వంటి సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించడాన్ని సరైనదే కానీ, జగన్ , పవన్ కళ్యాణ్ వంటి యువ రాజకీయ నేతలకు ప్రత్యామ్నాయంగా జూనియర్‌ను తీసుకువస్తే తెలుగుదేశం పార్టీలో ఆ కిక్ వేరేలా ఉంటుందని చెబుతున్నారట. అయితే చంద్రబాబు నాయుడు అంగీకరించడం, జూ.ఎన్టీఆర్ తిరిగి దగ్గర కావడం.. రెండూ కష్టమేననే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.