తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, నలభయ్యేళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతమని పదే పదే చెబుతుంటారు. కానీ, ఆయన చేష్టలు చూస్తే.. రాజకీయాల్లో మరీ చిన్న పిల్లలాటలా కనిపిస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు, ఈ రోజు కింద కూర్చున్నారు.. అదీ, అధికార పక్షం తీరుకి నిరసనగా. కొన్నాళ్ళ క్రితం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ‘నిరసన నిద్ర’ చేశారు చంద్రబాబు. అప్పట్లో అదో పెను సంచలనం. అసలు ఇలాంటి ఐడియాలు చంద్రబాబుకి ఎలా వస్తాయ్.? అని తెలుగు తమ్ముళ్ళు ఆశ్చర్యపోతుంటారుగానీ, అందులో వింతేముంది.! వింత సంగతి దేవుడెరుగు, ఈ తరహా పబ్లిసిటీ స్టంట్లు జనానికి విసుగు తెప్పిస్తాయి. చంద్రబాబు ఎప్పుడు పబ్లిసిటీ స్టంట్లు చేసినా, కొందరు తప్పక మద్దతిస్తారు.. కొందరు ఆయనకు దూరమైపోతుంటారు.. వాటిని తట్టుకోలేక. కానీ, చంద్రబాబే.. తాను చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ల గురించి ఆత్మవిమర్శ చేసుకోరు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ‘ఆత్మవిమర్శ’ అనే దాని గురించి చంద్రబాబు తెలుసుకోకపోవడమే శోచనీయం.
కింద కూర్చుంటే, అది నిరసన అవుతుందా.?
చంద్రబాబు ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా, ‘హూందాతనం’ అనే మాట చెబుతారు. అది లేకుండా, ఆయన ప్రసంగం పూర్తవదు.. అది ప్రెస్‌మీట్ కావొచ్చు, బహిరంగ సభ కావొచ్చు. కానీ, అసలంటూ ఆ ‘హూందాతనం’ అనేది ఆయనలో కనిపించదు. లేకపోతే, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అధికార పార్టీ చర్యలకు నిరసనగా కింద కూర్చోవడమేంటి.? అదీ అసెంబ్లీలో.! జనానికి ఏం సంకేతాలు పంపించాలనుకుంటున్నారు చంద్రబాబు ఈ చర్యల ద్వారా. ఇక్కడ, అధికార పార్టీ ఆయన్ని రెచ్చగొట్టి వుండొచ్చుగాక. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. కానీ, చంద్రబాబు ఎవరో రెచ్చగొట్టారని రెచ్చిపోతే, చూసేవాళ్ళకే జుగుప్సాకరంగా కనిపిస్తుంటుంది. పట్టుమని పాతిక మంది ఎమ్మెల్యేలు లేని పార్టీ, అసెంబ్లీలో 150 మందికి పైగా ఎమ్మెల్యేలున్న అధికార పార్టీని బెదిరించడం హాస్యాస్పదం కాక మరేమిటి.?
సింపతీ వచ్చే పనులు కావివి చంద్రబాబుగారూ.!
రోజులు మారాయి.. సోషల్ మీడియాలో మీమ్స్‌కి జనం మేగ్జిమమ్ ఎంజాయ్ చేస్తున్న రోజులివి. అలాంటి మీమ్స్ యుగంలో, ఇలాంటి చవక రాజకీయాలు, ఫన్ క్రియేట్ చేస్తాయేమో తప్ప.. జనాన్ని కాస్తంత ఆలోచనలో పడేసేవైతే కావు. ఇప్పటికే టీడీపీ మీదా, చంద్రబాబు మీదా, లోకేష్ మీదా సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కామెడీ మీమ్స్ కనిపిస్తున్నాయి.. ఇప్పుడీ ‘నేల మీద కూర్చునే’ ఎపిసోడ్‌తో చంద్రబాబు, మీమ్స్ సృష్టికర్తలకు కంటెంట్ ఇచ్చారు తప్ప, రాష్ట్ర ప్రజల దృష్టిలో సింపతీ పొందలేకపోయారు. ‘నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు అసెంబ్లీలో కింద కూర్చున్నారట.. ఎంత కష్టమొచ్చింది.?’ అంటూ జనమెవరూ మాట్లాడుకోవడంలేదంటేనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
నువ్వు నేర్పిన విద్యయే కదా..
నువ్వు నేర్పిన విద్యయే కదా.. అన్నట్టు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలుగుదేశం పార్టీకి ‘యధాతథంగా’ అన్నీ అప్పగించేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ‘ఇచ్చి పడేస్తోంది’. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని తెలివిగా వాడాలి. అది మానేసి, మరింత తెలివితక్కువ ఆలోచనలు చేస్తున్నారు. పార్టీ ఎందుకు భ్రష్టుపట్టిపోయిందో ఆత్మవిమర్శ చేసుకోవడం మానేసి, మరింత భ్రష్టుపట్టించే పబ్లిసిటీ స్టంట్లు చేసి చంద్రబాబు ఏం సాధించాలనుకుంటున్నారట.?