మూడు రాజధానుల విషయంలో ప్రత్యర్థి పార్టీల నుంచి తీవ్ర విమర్శలు, కోర్టు కేసులు ఎదుర్కొంటూ ఉక్కిరి బిక్కిరి అవుతున్న జగన్ కు కేంద్రం మరోసారి బాసటగా నిల్చింది. సరైన సమయంలో సరైన సాయంలాగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలతో అమరావతి విషయమై మరోసారి చిచ్చు రాజుకున్న సమయంలోనే కేంద్రం నుంచి ముఖ్యమంత్రి జగన్ కు ఈ మద్దతు లభించడం ఎంతో ఊరటనిస్తుందని భావించవచ్చు. అది కూడా వివిధ అంశాలకు సంబంధించి వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న హైకోర్టులోనే తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల విషయంలో కేంద్రం నుంచి స్పష్టమైన వివరణతో కూడా మద్దతు లభించడంతో వెయ్యి ఏనుగుల బలాన్నిస్తోంది. దీంతో తాను బలంగా కోరుకున్న మూడు రాజధానుల ఏర్పాటు దిశలో మరింత వేగంగా అడుగులు వేసేందుకు నూతనోత్సాహం లభించినట్లయింది.
కేంద్రం తాజా అఫిడవిట్
అమరావతి నుంచి రాజధాని తరలింపు విషయమై రైతుల నుంచి ఎపి హైకోర్టులో దాఖలైన కేసుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరోమారు వివరణ ఇచ్చింది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి కేంద్రం తాజాగా మరో అఫిడవిట్ దాఖలు చేసింది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు తాము చేస్తున్న న్యాయపోరాటంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంనే ఊటంకిస్తున్నారు. అందులో మూడు రాజధానుల గురించి లేనేలేదని అలాంటప్పుడు ఆ చట్టానికి విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందనేది వారి వాదన. . అయితే ఇప్పుడు ఈ విషయంలోనే కేంద్రం తమ వివరణ తెలుపుతూ గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ కు అనుబంధంగా మరో అఫిడవిట్ ను నేడు ధర్మాసనంకు సమర్పించింది.
కేంద్రం ఏం చెప్పిందంటే?…
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఔచిత్యాన్ని రాజధాని రైతులు సరిగా అర్ధం చేసుకోలేదని, అందువల్లే వారు ఈ చట్టం ప్రకారం మూడు రాజధానులు ఏర్పాటుచేయడానికి వీలులేదని వాదిస్తున్నారని కేంద్రం అభిప్రాయపడింది. విభజన చట్టంలో రాజధాని అని ఉంటే ఒక రాజధాని అని మాత్రమే అర్థం చేసుకోరాదని, కాబట్టి ఆ ఒక్క రాజధానికే కేంద్రం సాయం చెయ్యాలని భావించరాదని, రాష్ట్రం రాజధానిగా దేనిని లేదా వేటివేటిని పేర్కొందో వాటికి సహాయసహకారాలు అందించవలసి బాధ్యత తమపై ఉందని వివరించింది. తాము గత అఫిడవిట్ లో పేర్కొన్నట్లు రాష్ట్ర రాజధాని ఏర్పాటులో కేంద్రం ప్రమేయం ఉండదని మరోసారి స్పష్టంగా పేర్కొంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక రాజధాని ఏర్పాటు చేసుకున్నా లేదా వివిధ రాజధానులు ఏర్పాటు చేసుకున్నా అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని, ఇందులో తమ జోక్యం ఉండదని మరోమారు స్పష్టంగా తెలియజేసింది.
తాము ఏం చేస్తామంటే?
రాజధాని విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే వాని విచక్షణా అధికారాన్ని గౌరవిస్తూ వారు ఎంచుకున్న రాజధాని లేదా రాజధానులు వాటికి కేంద్రం నుంచి రాజ్యాంగబద్దంగా అందించవలసిన సహాయసహకారాలు అందించడం వరకే తమ బాధ్యత ఉంటుందని తెలిపింది. అంతేతప్ప తమ పరిధిని అతిక్రమించి తాము జోక్యం చేసుకోమని తేల్చేసింది. దీంతో సిఎం జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల కాన్సెప్ట్ కు కేంద్రం నుంచి సహకారమే తప్ప అభ్యంతరాలు ఉండవని స్పష్టంగా తేలిపోయింది. అలాగే మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు చూపుతున్న మరో అభ్యంతరం హై కోర్టు తరలింపు విషయంపైనా కేంద్రం తన వివరణ ఇచ్చింది.
హైకోర్టు తరలింపుపైన
విభజన చట్టాన్ని ఉదహరిస్తూ హైకోర్టు కూడా రాష్ట్రానికి ఏదైతే రాజధానిగా ఉందో అక్కడే ఉంచాలని రాజధాని రైతులు చేస్తున్న మరో వాదన కూడా సమంజసం కాదని కేంద్రం పేర్కొంది. హైకోర్టు ఎక్కడ ఉంటే అదే రాజధాని అని, అందువల్ల ఆ రాజధానిని తరలించడానికి వీలులేదని, ఆ ప్రకారం అమరావతి నుంచి రాజధాని తరలించకూడదనే వాదనపై కూడా వివరణ ఇచ్చింది. ఎపి విభజన చట్టం ప్రకారం రాజధానిలోనే హైకోర్టు ఉండాలని ఎక్కడా నిర్దేశించలేదని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర హైకోర్టును ఎక్కడ ఏర్పాటుచేయాలనే నిర్ణయం తీసుకునే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కేంద్రం వివరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టును కర్నూలుకు తరలించాలన్న నిర్ణయానికి కేంద్రం నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదనేది తేల్చిచెప్పినట్లయింది. కేంద్రం మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఎపి ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించడంతో ఇక సిఎం జగన్ ఆ దిశలో మరింత వేగంగా దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.