బీఆర్ఎస్ పొలిటికల్ ఆట.! ఇదేం సయ్యాట.?

తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఏపీ మంత్రుల మీద గుస్సా అవుతున్నారు. ఏపీ మంత్రులూ, తెలంగాణపై మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం.. ఈ పంచాయితీ గట్టిగా నడుస్తోంది. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు నోరు జారితే, ఏపీ సీఎం కార్యాలయం వాతలు పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. పైకి ఎన్ని తిట్టుకున్ని వైసీపీ – బీఆర్ఎస్ మధ్య సన్నిహిత సంబంధాలు వున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. ఇదో గందరగోళపూరిత రాజకీయాన్ని సృష్టించే ఆట మాత్రమే.

కవిత వ్యవహారం సహా అనేక అంశాల నుంచి జనం దృష్టిని మరల్చేందుకు బీఆర్ఎస్ తనదైన వ్యూహాన్ని విశాఖ స్టీలు ప్లాంటు చుట్టూ అమలు చేసింది. వైసీపీ కూడా ఇదే బాటలో, బీఆర్ఎస్‌ని రెచ్చగొడుతోంది. అంతే తప్ప, రెండు పార్టీల మధ్యా రాజకీయ వైరం వుందనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

ఏపీ జనాలు, తెలంగాణలో ఓట్లు నమోదు చేసుకోవాలని హరీష్ రావు అనడం, ‘మేం లేకపోతే, మీ హైద్రాబాద్ అడుక్కు తింటుంది..’ అని ఏపీ మంత్రలు అనడం.. రెండూ అధిక ప్రసంగాలే. రెండూ వేర్వేరు రాష్ట్రాలు. ఎవరి గోల వారిదే.! ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టడానికి తప్ప.. నేతల వ్యాఖ్యలు ఇంకెందుకూ ఉపయోగపడవు.

ఇరు రాష్ట్రాలకు సంబంధించి విభజన సమస్యలపై ఉమ్మడిగా కేంద్రంపై పోరాడాల్సిన రెండు అధికార పార్టీలు, ‘మాకేటి సంబంధం.?’ అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఉమ్మడి ఆస్తుల పంపకాల వ్యవహారమే ఓ కొలిక్కి రాలేదాయె.! ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేసీయార్, అది మానేసి.. ఏపీలో బీఆర్ఎస్ అంటున్నారు. ఇదో పెద్ద కామెడీ మళ్ళీ.!