సాధారణంగా చిన్న చిన్న నొప్పులను తక్కువ అంచనా వేస్తాం.. అయితే వయసు పెరుగుతోంది అని, సరళమైన గాయం అయ్యిందేమో అని అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తాం. కానీ కొన్నిసార్లు ఈ నిర్లక్ష్యం మనకు పెద్ద ముప్పు అవుతుంది. ఎముకల్లో వచ్చే సాధారణ నొప్పులు, చిన్న వాపులు, గడ్డలు ఎముక క్యాన్సర్ కు సంకేతాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
తొలిదశలో ఈ వ్యాధిని గుర్తిస్తే నివారించవచ్చు. కానీ అందులోనే ఎక్కువ మంది జాగ్రత్త పడరు. ఎముకల్లో వచ్చే నొప్పి మొదట్లో అప్పుడప్పుడు కలుస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అది శాశ్వతమైపోతుంది. ముఖ్యంగా రాత్రిపూట ఈ నొప్పి ఎక్కువగా బాధిస్తుంది. అలాగే నొప్పి ఉన్న ప్రాంతంలో వాపు కనిపిస్తే అది కూడా ప్రమాదానికి సంకేతం. కొన్నిసార్లు వాపు గడ్డలా గట్టిగా ఉండిపోతుంది. ఇది కణితి పెరుగుతున్న సూచన అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఎముక క్యాన్సర్ వల్ల ఎముక బలహీనమవుతుంది. కాబట్టి చిన్న గాయానికి కూడా ఎముక విరిగిపోతుంది. సాధారణంగా పెద్ద దెబ్బలు తగిలితేనే ఎముక విరగాలి. కానీ చిన్నగా ఎముకలు విరిగితే మాత్రం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీర బరువు కూడా వేగంగా తగ్గటం, శక్తి తగ్గి ఎప్పుడూ అలసటగా ఉండటం కూడా ఈ వ్యాధి లక్షణాలు కావచ్చు. కాలి ఎముకల్లో నొప్పి కారణంగా నడకలో ఇబ్బంది కలగవచ్చు. చేతులు, కాళ్లలో చిన్న పని చేయడంలోనూ కష్టం ఏర్పడుతుంది.
వైద్యుల సూచనల ప్రకారం.. ఎముకల్లో నొప్పి లేదా వాపు ఉంటే తక్షణమే ఆస్టియోపతిని సంప్రదించాలి. తొలిదశలో ఇది చికిత్సకు లొంగుతుంది. ఆలస్యం అయితే ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేయవచ్చు అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎముకల్లో వచ్చే నొప్పి చిన్నది అని తక్కువ అంచనా వేయకండి. సమయానికి వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. ముందే గమనిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చు.
