తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు నియమితులయ్యారు. పార్టీ కార్యకర్తలతో మన్నెగూడలో మాట్లాడిన ఆయన, బీజేపీలో కొత్తవాడు, పాతవాడు అనే తేడా ఎప్పుడూ ఉండదని స్పష్టం చేశారు. ‘‘బిడ్డ పుట్టగానే కుటుంబానికి సభ్యుడవుతాడు కదా, అలాగే పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త కూడా కుటుంబ సభ్యుడే’’ అంటూ రామచందర్ రావు వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి స్వీకరించిన రామచందర్ రావు, ‘‘తన పేరుకే అధ్యక్షుడిని కానీ, నిజానికి కార్యకర్తే, మీ సేవకుడే’’ అని అన్నారు. ‘‘ఈ పార్టీని ఇంత దాకా తీసుకొచ్చింది కార్యకర్తల చెమటే. నక్సలైట్ల తూటాలకు కూడా నిలువలేని కార్యకర్తలు శ్రమించారు. నేనూ ఆ బాధితుడే’’ అని గుర్తు చేశారు.
అందరం కలిసికట్టుగా ఉంటే తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం కష్టమేమీ కాదన్నారు. తెలంగాణ యువత, మహిళలు ఎక్కువ సంఖ్యలో బీజేపీ వైపు రావాలని, మహిళలకు రిజర్వేషన్ల ద్వారా మరిన్ని అవకాశాలు వస్తాయని తెలిపారు.
అయితే, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఫేక్ న్యూస్ ను పుట్టించి వాట్సాప్ వర్శిటీలు నడుపుతున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే నేరుగా ఎదురు రండి. వెనకుండి ట్రోల్ చేస్తే వదిలి పెట్టమని అన్నారు. తానూ క్రిమినల్ లాయర్‌ని. అవసరం వస్తే ఫేక్ న్యూస్ వాడిని జైలులో పెట్టిస్తా అని హెచ్చరించారు. ఏబీవీపీగా ఉన్నప్పుడు జైలుకు వెళ్లి వచ్చినవాడిని. లాఠీ దెబ్బలు తిన్నా, సిద్ధాంతం వీడలేదని పేర్కొన్నారు. అదే దీక్షతో ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తా అని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీని అధికారంలోకి తెచ్చే వరకు నా పోరాటం ఆగదు. అందరం ఒకే కుటుంబం, అందరం ఒకే బలం అని చెబుతూ అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.