వైఎస్ మరణించి పదేళ్లు దాటిపోయింది. ఆయన అయిదేళ్ల పాలనలో చేపట్టిన అనేక సంక్షేమ పధకాలు, ఆదర్శవంతమైన పాలన కారణంగా ఆయన ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ మరణించిన అయిదేళ్ల తరువాత రాష్ట్రం విడిపోయింది. వైఎస్ అంటే రాజకీయంగా గిట్టని తెలంగాణ వాదులు కూడా వ్యక్తిగా వైఎస్ ను అభిమానిస్తారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రాలో ఎలా అభిమానులు ఉన్నారో తెలంగాణాలో కూడా వైఎస్ కు అలాంటి అభిమానులే ఉన్నారు. తెలంగాణ వాదులైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం వైఎస్ ను అభిమానిస్తారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణకు చెందిన మహిళా నాయకురాలు సబితా ఇంద్రారెడ్డిని హోమ్ మంత్రిని చేసిన ఘనత వైఎస్సార్ సొంతం. అలాగే శ్రీమతి గీతారెడ్డి, సునీతా లక్ష్మణారెడ్డి, కొండా సురేఖ లాంటి తెలంగాణ నాయకురాళ్లను కేబినెట్ మంత్రులుగా చేశారు ఆయన. ఇప్పుడు రాజకీయంగా వైఎస్సార్ అంటే కొందరికి నచ్చకపోవచ్చు. కానీ, సీమాంధ్రులలో, తెలంగాణా ప్రజల్లో వైఎస్ అంటే అభిమానం ఉన్నవారే ఎక్కువ. ఆయన్ను మహానేత అంటూ కొందరు మ్లేచ్చులు నోరు పారేసుకోవచ్చు.. ఆయన ఏమి మేశారో ఒక్కరు కూడా ఇంతవరకూ నిరూపించలేకపోయారు. ఆయన పాలనలో ఏదో లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ సిబిఐ పదేళ్లనుంచి కొండను తవ్వుతూ ఇంతవరకు ఎలుకను కూడా పట్టలేకపోయింది.
అలాంటి మహా నాయకుడిపై అకారణంగా, అసందర్భంగా కొత్తబిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు మొన్ననే చావుతప్పి కన్ను లొట్టపోయిన చందాన వెయ్యి ఓట్ల మెజారిటీతో ఉపఎన్నికలో గెలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు హఠాత్తుగా దివంగత మహానేత మరణం మీద దుర్భాషలు ఆడటం ఆశ్చర్యం కలిగించింది. చదువు సంస్కారం ఉన్నవాడిగా రఘునందన్ రావును గౌరవించే మేధావులు, విశ్లేషకులు కూడా రఘునందన్ రావు అవాకులు చవాకులు పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నగర పాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ చెయ్యడం లేదు. తెలంగాణ విడిపోయాక తన పరిమితులు తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక తెలంగాణ రాష్ట్రంతో, ప్రజలతో సుహృద్భావ సంబంధాలు ఏర్పడ్డాయి. తెలంగాణ వారు సైతం జగన్ ను మెచ్చుకుంటున్నారు. అలాగే కేసీఆర్ పాలన పట్ల సీమాంధ్రులు కూడా సంతోషంగా ఉన్నారు.
రాజకీయాల్లో, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఇవాళ రాజు రేపటి బంటు అవుతాడు. నేటి బంటు రేపు రాజు కావచ్చు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజల అభిమానం, ఆదరణ మీద ఆధారపడి ఉంటాయి. అలాంటి ప్రజలు అభిమానించే ఒక నాయకుడి మీద అకారణంగా తూలనాడటం ఎవరి మెప్పు కోసం? నిజానికి సీమాంధ్రులు కొందరు బీజేపీ అభిమానులు. బీజేపీకి కూడా కొన్ని సీట్లు రావాలని కోరుకున్నారు. కానీ, రఘునందన్ రావు వాచాలతతో సన్నివేశం ఒక్కసారిగా మారిపోయింది. హైద్రాబాద్ నగరంలో రఘునందన్ రావు దిష్టిబొమ్మలను దగ్ధం చేసారు. బీజేపీ మీద విరుచుకుని పడ్డారు..
ఊహించని ఈ విపరిణామంతో బీజేపీ కంగు తిన్నది. రఘునందన్ రావు వ్యాఖ్యల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటాయో ఆలస్యంగా అర్ధం చేసుకున్నది. ఫలితంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి రఘునందన్ రావు వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరాల్సి వచ్చింది. రఘునందన్ రావు కూడా వివరణ ఇచ్చుకున్నప్పటికీ అది ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. తాను చేసిన తప్పును కేసీఆర్ మీద రుద్దాలని ప్రయత్నించారు. కేసీఆర్ ఈ వ్యాఖ్యలను చేసారు అని బుకాయించాలని ప్రయత్నించి తనలో ఏమాత్రం హుందాతనం లేదని నిరూపించుకున్నారు. ఎప్పుడో ఉద్యమ సమయంలో, వైసిపి తెలంగాణాలో కూడా ఉనికిలో ఉన్న సందర్భంలో కేసీఆర్ ఆ వ్యాఖ్యను చేసి ఉండవచ్చు. కానీ ఆయన ఆ తరువాత వైఎస్సార్ ను బహిరంగంగా ప్రశంసించారు. అసెంబ్లీలో కూడా వైఎస్సార్ సంక్షేమ పధకాలను మెచ్చుకున్నారు. ఆ తరువాత ఎన్నడూ ఆయన వైఎస్ మరణం పట్ల అనుచితంగా మాట్లాడలేదు. వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కేటీఆర్ తో సమానంగా ఆదరిస్తున్నారు. కేసీఆర్ సొంత పత్రిక అనదగ్గ నమస్తే తెలంగాణ పత్రిక సైతం రఘునందన్ రావు వ్యాఖ్యలను మొదటి పేజీలో ప్రచురించింది. వైసిపి సోషల్ మీడియా బాధ్యుడు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఖండనను ప్రముఖంగా ప్రచురించింది. కేసీఆర్ కి ఉన్న సంస్కారం రఘునందన్ రావు కు ఎక్కడుంది?
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు క్షమాపణలు చెప్పినా సీమాంధ్రులు ఆయన్ను మన్నించకపోవచ్చు. బీజేపీ కూడా రఘునందన్ రావు వ్యాఖ్యల పట్ల తీవ్ర అసంతృప్తిని, ఆందోళనను వ్యక్తం చేసింది. వాస్తవం చెప్పాలంటే కేంద్రప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య సంబంధాలు బాగున్నాయి. మోడీ, అమిత్ షా లాంటి అగ్రనేతలు వైసిపి నాయకులకు విలువ, గౌరవం ఇస్తున్నారు. ఆ కారణంగా బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత వ్యతిరేకత తగ్గుముఖం పట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈ రకంగా అధికార పార్టీ అధినేత తండ్రిపై దుర్వ్యాఖ్యలు చెయ్యడం రెండు పార్టీల మధ్య సంబంధాలను దెబ్బ తీస్తాయి!
గొంతు పైకెత్తి, శక్తికొద్దీ ఊళ వేసినంతమాత్రాన సృగాలం ఎన్నటికీ మృగరాజు కాలేదని రఘునందన్ రావు లాంటి నడమంత్రపుసిరి నాయకులు గ్రహిస్తే వారి పార్టీలకు మంచిది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు