బీజేపీ అధ్యక్షుడు కొత్తవారే.. కానీ పైత్యం పాతదే 

బీజేపీ అధ్యక్షుడు కొత్తవారే.. కానీ పైత్యం పాతదే
ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీ ఏపీ రాజధాని విషయంలో రెండు నాలుకల ధోరణిని అవలంభించిన సంగతి తెలిసిందే.  బీజేపీలో కొందరు తాము అమరావతికే కట్టుబడి ఉన్నామని, రాజధాని తరలిపోయే ఛాన్సే లేదని అంటే ఇంకొందరు మాత్రం రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని విషయమని, అందులో కేంద్రం కలుగజేసుకునే వీలే లేదని అన్నారు.  ఇలా సగం మంది అటు సగం మంది ఇటు ఉండటంతో బీజేపీ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయం చేస్తోందని, ఏ క్షణమైనా వారి నిర్ణయాలు మారిపోవచ్చని స్పష్టంగా తెలిసిపోయింది.  కేంద్రం యొక్క ఈ ద్వంధ వైఖరి అర్థంకాకే కన్నా లక్ష్మీనారాయణ ఆమరావతికి అనుకూలంగా లేఖ రాసి అధ్యక్ష పదవిని కోల్పోయారనే ప్రచారం కూడా ఉంది.  
 
ఈ గందరగోళం నడుమే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి మార్పు జరిగింది.  కొత్త సారధిగా సోము వీర్రాజు పదవిలో కూర్చున్నారు.  ఆయన నియామకం పట్ల రాజకీయ పార్టీల్లో వివిధ రకాల చర్చలు జరుగుతున్నా అమరావతి రైతులు, ప్రజలు మాత్రం కేంద్రం ప్రతినిధిగా సోము వీర్రాజుగారి మనసులో రాజధానిపై ఎలాంటి స్టాండ్ ఉంది, ఈయనకైనా హైకమాండ్ నుండి ఒక క్లారిటీ అందిందా అనే ఆలోచిస్తున్నారు.  ఈయనైనా ఆమరావతికి మద్దతు ఇస్తే తమకు బలం పెరుగుతుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు.  కానీ చూడబోతే సోము వీర్రాజు సైతం పాత పాటే పాడుతున్నట్టు ఉన్నారు.   రాగం మార్చి మరింత క్కన్ఫ్యూజ్ చేస్తూ పాడుతున్నారు.  
 
తాజాగా మీడియా సమావేశంలో మూడు రాజధానుల విషయంలో మీ స్టాండ్ ఏమిటనే ప్రశ్న రాగా అసలు మూడు రాజధానులు కాదు జిల్లాకొక రాజధాని పెట్టాలనేది తమ ఆలోచన అని, వికేంద్రీకరణ తమ ప్రధాన పాలసీ అని పెద్ద స్టెట్మెంట్ ఇచ్చారు.  ఎందుకంటే హైదరాబాద్‌లో కలిసి ఉన్న సమయంలో మనకు తీవ్ర అన్యాయం జరిగిందని అందుకే ప్రతి జిల్లాను రాజధానిగా చేసి 13 జిల్లాలను అభివృద్ధి చేయాలన్నదే బీజేపీ వైఖరి అని తెలిపారు.  ఇలా 13 జిల్లాలకు 13 రాజధానులు అనే మాట వినేసరికి జనానికి ఫీజులు ఎగిరినంత పనైంది.  ఇక్కడ మూడు రాజధానులు అంటేనే పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటే ఈయనొచ్చి జిల్లాకో రాజధాని అంటున్నారు ఇదెక్కడి విడ్డూరం నాయనా అనుకుంటున్నారు.  
 
సరే.. అన్నారు…మరి అది ఎలా సాధ్యమో ఆయనే సెలవిస్తే వినాలని అనుకున్నారు.  13 క్యాపిటల్స్ అంటున్న ఈయన మూడు రాజధానులకు నో ఎందుకు చెబుతారు అనుకున్నారు.  సరే 13 రాజధానుల కాన్సెప్ట్ ఎలా సాధ్యమో సెలవిస్తే వినాలని అనుకున్నారు.  మొత్తానికి బీజేపీ ముసుగు తొలగి మూడు రాజధానులకు సానుకూలమనే విషయం స్పష్టమైందని అనుకున్నారు.  కానీ ఈలోపే వీర్రాజుగారు మరో బాణం విడిచారు.  అమరావతి గురించి గతంలోనే చెప్పామని అంటూ రాజధాని అక్కడే ఉండాలని, భూములిచ్చిన రైతులకు న్యాయం జరగాలని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలని అంటూ హైకోర్టు రాయలసీమలో పెట్టడానికి తమకు అంగీకారమేనని అన్నారు.  మరివైపు అమరావతి జేఏసీకి వీర్రాజుగారు హామీ ఇచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. 
 
ఈ మాటలు వింటే కోర్టు రాయలసీమలో ఉండాలనే వీరు మూడు రాజధానులకు అనుకూలమా లేకపోతే అమరావతిలోనే అడ్మినిస్ట్రేషన్ ఉండాలంటే సింగిల్ క్యాపిటల్ కు మద్దతు ఇస్తున్నారా.. ఇవేమీ కాకపోతే విశాఖలో రాజధాని ఉండకూడదనేది వీరి ప్రధాన లక్ష్యమా అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి.  మొత్తం మీద కొత్త అధ్యక్షుడు వచ్చినా బీజేపీ పాత పంథా మాత్రం వదల్లేదని తేటతెల్లమైంది.  ఇప్పటికే హోదా అంశంలో మాట తప్పి తిరుగుబాటు రాకుండా ఏవేవో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఇప్పుడు రాజధాని విషయంలో తమ రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీఠ వేస్తూ పోతే భవిష్యత్తులో ఆంధ్రా ప్రజల తిరస్కారానికి గురికావలసి ఉంటుంది.