పవన్ కళ్యాణ్ పరువు కాపాడిన బీజేపీ

BJP defended Pawan Kalyan
అవును..నిజమే…బీజేపీ గనుక చివరి నిముషంలో ఆ నిర్ణయం తీసుకోకుండా ఉన్నట్లయితే పవన్ కళ్యాణ్ పరువు మూసీలో కలిసిపోయేది.  అసలు పవన్ కు ఏమి పరువు మిగిలి ఉంది?  దానిలో పోవడానికి ఏముంది అనే సందేహం కొందరికైనా కలగొచ్చు…ముందుగా ఒక చిన్న కథ చెప్పుకుందాము.
 
చాల ఏళ్ళక్రితం ఒక గ్రామానికి ఎవరో పరదేశి వచ్చాడు.    గ్రామపెద్దను కచేరి  కార్యాలయంలో మరో పదిమంది పెద్దలతో సమావేశంలో ఉండగా కలిసి “అయ్యా…నేను మహా బలశాలిని.  మల్లయోధుడిని…కుస్తీలు పట్టే వస్తాదును…నా బలాన్ని పరీక్షించి తగిన బహుమతి ఇవ్వండి”  అని వినయంగా కోరాడు.  
 
గ్రామపెద్ద ఆశ్చర్యపోయి అందుకు అంగీకరించి “నువ్వు ఏమి విద్యను ప్రదర్శిస్తావు?  ఎప్పుడు పరీక్షించాలి?”  అడిగాడు కుర్రాడిని అబ్బురంగా చూస్తూ. .
 
ఆ కుర్రాడు మహోత్సాహంతో “అయ్యా…ఆ చివరన ఉన్న కొండను మీరు మొయ్యగలరా?”  అడిగాడు.    
 
గ్రామపెద్ద ఒక వెర్రిచూపు చూసి “నువ్వేమైనా పిచ్చోడివా?  కొండను మొయ్యడానికి నేనేమైనా బాలకృష్ణుడినా? కొంపదీసి నువ్వు మోస్తావా ఏమిటి?’  అన్నాడు నవ్వును లోలోపల దాచుకుంటూ.  
 
“చిత్తం..చిత్తం..అదే నేను మీకు చూపించబోయే విద్య. నా బలం మీకు తెలియదు.  నేను ఒక ఈల వేస్తె గోలకొండ అదిరిపడుతుంది…నేను మోసి చూపిస్తాను.  అయితే ఒక షరతు”  అన్నాడు కుర్రాడు.  
 
గ్రామపెద్దలో ఉద్రేకం పెరిగింది.  “చెప్పు…ఆ షరతు ఏమిటో…” అన్నాడు
 
“ఒక ఏడాది పాటు నాకు రోజూ మూడుపూటలా కడుపునిండా భోజనం పెట్టండి.  చికెన్, మటన్, ఫిష్, పంది, కుందేలు, కుముజు, నెమలి…మాంసాహారానికి ఏది పనికొస్తే వాటన్నిటితో పదిరకాల వంటకాలు చేసి  బాగా తిండి పెట్టండి.  చివరి రోజు నా విద్య ఏమిటో ప్రదర్శిస్తాను.  కొండను ఎంతసేపైనా మోస్తాను”  అన్నాడు.  
 
గ్రామపెద్దలందరికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి.  ముక్కుపుటాల నుంచి వేడివేడిగా పొగలు చిమ్మాయి.  కొందరు పళ్ళు పటపట కోరుకుంటున్నారు….
 
గ్రామపెద్ద ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ “నువ్వు అడిగిన షరతులు అన్నింటికీ ఒప్పుకుంటున్నాము.  నగరం మధ్యలో నీకు మంచి వసతి ఏర్పాటు చేసి ముప్పొద్దులా భోజనాలు పంపుతాము.  చివరి రోజు కొండను మోశావా…నువ్వు ఊహించనంత ప్యాకేజి ఇస్తాము…మొయ్యలేకపోయావా…నీ తలతీసి కచేరి గుమ్మానికి వేలాడదీస్తాము.” హెచ్చరించాడు.  
 
ఏడాదిపాటు కుర్రాడికి కోరుకున్న తిండిని ఏర్పాటు చేసారు గ్రామస్తులు.  ఏడాదికాలం ఇట్టే గడిచిపోయింది.  చివరిరోజు గ్రామస్తులు అందరూ కర్రలు, బరిసెలు, గొడ్డళ్లు చేతుల్లో పెట్టుకుని వచ్చారు…”పదరా…కొండ దగ్గరకు…”అన్నాడు గ్రామపెద్ద వెటకారంగా 
 
కుర్రాడు నవ్వుతూ వారితో కలిసి కొండ దగ్గరకి వెళ్లి వంగాడు.  “పెద్దలారా…ఆ కొండను నా వీపుమీద పెట్టండి.  మీరు ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు మోస్తాను”  అన్నాడు.
 
గ్రామస్తులంతా షాక్ తిన్నారు….కొండను మేమెలా నీ వీపు మీద పెడతాము..,.కొండను ఎలా ఎత్తుతారు?  నువ్వే ఎత్తాలి కొండను.   ఇన్నాళ్లూ మా తిండిని దున్నపోతులా మేశావు…  అంతా మోసం…దగా…” అరిచారు.    
 
కుర్రాడు తాపీగా “నేను కొండను ఎత్తుతానని చెప్పలేదు.  మోస్తాను అని మాత్రమే చెప్పాను… కావాలంటే రికార్డులు పరీక్షించుకోండి…నా బలాన్ని మీరు అతిగా ఊహించుకుని నన్ను మేపితే దానికి నాదా బాధ్యత?  చెప్పండి…కొండను నా వీపుమీద పెడతారా లేదా?…నేను మరో ఊరికి  వెళ్లి మరో ఏడాది  అక్కడ ఏదోలా  పాకేజీలు తెచ్చుకోవాలి…” అన్నాడు.  
 
గ్రామస్తులు చేసేదేమీ లేక కుర్రాడిని తిట్టుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు.  
 
BJP defended Pawan Kalyan
BJP defended Pawan Kalyan
 
జనసేన అనే దుకాణాన్ని పెట్టుకున్న పవన్ కళ్యాణ్ మొదటి ప్రయత్నంలోనే రెండు చోట్లా ఓడిపోయి బొక్కాబోర్లాపడి నవ్వులపాలయ్యాడు.  గెలిచిన ఒక్క ఎమ్మెల్యే మనిషి ఒకచోట మనసు ఒకచోట అన్నట్లున్నాడు.  సొంత రాష్ట్రంలో, సొంత జిల్లాలో ఓడిపోయినవాడికి ఏదో కొండంత బలం ఉన్నదని నమ్మి బీజేపీ తన మతిలేనితనాన్ని నిరూపించుకుంది.   అప్పటివరకు పవన్ కు బ్రహ్మాండమైన బలం ఉన్నదని, ఆయన పార్టీ అభిమానుల ఓట్లన్నీ తమకే పడతాయని కలలు కన్నది.   కానీ, తెలంగాణ బీజేపీకి ఆలస్యంగా బుర్రలో ట్యూబ్ లైట్ వెలిగింది.  “రాష్ట్రం విడిపోయిందనే బాధతో పదకొండు రోజులు అన్నం తినలేదు” అని ఒకప్పుడు   ఆవేశంలో నోరుజారిన పవన్ కళ్యాణ్ డైలాగులు నగర కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతంగా విజయవిహారం చేస్తున్నాయి.  పవన్ తో పొత్తు పెట్టుకుంటే వచ్చే ఓట్లు కూడా రావని గ్రహించింది.   వెంటనే పవన్ ఇంటికి పరిగెత్తారు బీజేపీ నాయకులు.  పొత్తు లేదు..గిత్తు లేదు… అసలు నీకు మాకు ఎలాంటి సంబంధమూ లేదు…నీ గౌరవం నిలవాలంటే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని నీకు నువ్వే ప్రకటించు”  అని మొహం మీదనే చెప్పేసింది.  
 
పవన్ కు కూడా అదే కావాలి.  ఎందుకంటే తన పార్టీ పోటీ చేస్తే తమ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని తెలుసు.  పోటీ చేస్తే పరువు పోవడం ఖాయం అని తెలుసు.  ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోతే ఇక భవిష్యత్తులో తనకు ప్యాకేజీలు డిమాండ్ చేసే అవకాశం మిగలదు.  ఎప్పుడెప్పుడు బీజేపీ వారు వచ్చి తనను పోటీ నుంచి విరమించుకోమని కోరుతారో అని ఎదురు చూసాడు.  కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు బీజేపీ వాళ్ళు పాకేజీ మూటలతో రాకపోయినప్పటికీ కనీసం పోటీ నుంచి తప్పుకోమని అడిగారు.  
  
దాంతో జనసేన అధిపతి కథ కంచికి వెళ్ళింది.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు