చాయ్‌తో కలిపి స్నాక్స్‌గా తినే బిస్కెట్లు భారతీయుల రోజువారీ ఆహారంలో ఒక భాగంగా మారిపోయాయి. చవకగా లభించే ఈ క్రంచీ ఫుడ్స్ తాత్కాలికంగా కాస్త ఆకలిని తీర్చడంలోనూ.. నోరూరించే ఫుడ్. అయితే ఇలా తినే బిస్కెట్లు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే ‘స్వీట్ ట్రాప్’ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా బిస్కెట్లు.. మైదా, చక్కెర, ఫ్యాట్, కృత్రిమ ఫ్లేవర్స్‌తో తయారవుతాయి. వీటిలో న్యూట్రిషన్ అవసరమయినంతగా ఉండదు. ఫైబర్ లేని మైదా జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. బిస్కెట్లను తరచూ తినడం వల్ల మలబద్ధకం, కొలెస్ట్రాల్ పెరగడం, బరువు అధికంగా కావడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా హైడ్రోజినేటెడ్ ఆయిల్స్‌తో తయారు చేసిన బిస్కెట్లలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ గుండెకు ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ‘బ్యాడ్ కొలెస్ట్రాల్’ను పెంచి గుండెపోటుకు దారి తీస్తాయని అంటున్నారు.
ఇక బిస్కెట్లలో అధికంగా ఉండే చక్కెర రక్తంలో షుగర్ స్థాయిని ఒక్కసారిగా పెంచుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ప్రమాదకరం. అంతేకాదు, గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండటంతో బ్లడ్‌షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగి తగ్గడం వల్ల మూడ్ స్వింగ్స్, అలసట, మానసిక ఆందోళన మొదలవుతాయి. దీర్ఘకాలంగా చూస్తే ఇది డిప్రెషన్‌కు కూడా దారితీస్తుంది.
ప్రమాదకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. ధమనుల్లో ప్లేక్‌లు ఏర్పడి హార్ట్ అటాక్, స్ట్రోక్‌లు రావొచ్చు. దీంతో పాటు మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు కూడా దాపురించవచ్చు.
ఇలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే బిస్కెట్లకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం. తాజా పండ్లు, నట్స్, మొలకెత్తిన గింజలు, వేయించిన శనగలు వంటి వాటిని స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, ప్రొటీన్లు, సహజ చక్కెరలు ఉంటాయి. బిస్కెట్లకు పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయంగా కాకపోయినా, Whole Wheat లేదా ఓట్స్‌తో తయారైన బిస్కెట్లు తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌ను తగ్గించుకోవడం ద్వారా శరీరానికే కాదు.. మనస్సుకీ మేలే. దుర్మార్గమైన ఆరోగ్య సమస్యలకు బలైపోవడం కంటే.. ఇప్పుడు మారడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
