దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం లో రోజుకో విషయం వెలుగులోకి వస్తుండగా.. ఆ స్కాంకు సంబందించిన అన్ని రిమాడ్ రిపోర్టుల్లోనూ ప్రధానంగా బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత పేరు వినిపిస్తోందని తెలుస్తోంది. దీంతో… ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 9న హస్తినకు రావాలని ఈడీ ఆ నోటీసులో పేర్కొంది.
ఈడీ అరెస్టు చేసిన హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్ మెంట్ మేరకు కవితకు ఈ నోటీసులు అందినట్లు తెలుస్తోంది. తాను కవిత బినామీనంటూ రామచంద్ర పిళ్లై ఒప్పుకున్నట్లు ఈడీ తెలిపింది. కాగా.. ఈ నెల 13వరకూ రామచంద్రపిళ్లై తమ కస్టడీలోనే ఉంచనున్నట్లు ఈడీ పేర్కొంది. అయితే రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడైనట్లు చెబుతున్నారు. తాను కవిత తరుపున విజయ నాయర్ తోపాటు లావాదేవీలు చేసినట్లు రామచంద్ర పిళ్లై ఒప్పుకునారన్నది కవిత కు నోటీసులివ్వడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే సుమారు 29సార్లు రామచంద్రపిళ్లై ని విచారించిన ఈడీ అధికారులు.. ఈసారి కవిత సమక్షయంలో మరోసారి విచారించనున్నారని తెలుస్తోంది. అయితే… ఇంతక ముందు ఇదే కేసులో సీబీఐ కూడా కవితను విచారణ చేసింది. కాకపోతే అప్పుడు హైదరాబాద్ వచ్చి విచారించిన దర్యాప్తు సంస్థలు… ఈసారి డైరెక్టుగా ఢిల్లీకే రమ్మని కవితను పిలవడం గమనార్హం. దీంతో ఈ విచారణ అనంతరం ఈడీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది! ఈ కేసుకు సంబందించి దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకూ 11మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే!
కాగా.. రామచంద్ర పిళ్లైతో తనకు స్నేహం లేదని తానెప్పుడూ చెప్పలేదని, కానీ తన ఫ్రెండ్స్ వ్యాపారాల్లో తన ప్రమేయం ఎంతన్న విషయం గ్రహించాలని.. నా స్నేహితుల వ్యాపారాల్లో తప్పులు జరిగాయో లేదో తనకు తెలియదని కవిత చెప్పిన సంగతి తెలిసిందే.