బీహార్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అక్కడి ఓటర్లకు ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ ఇచ్చింది. ఆ ప్రకటన కాస్తా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యింది. అదేంటీ, కరోనా వ్యాక్సిన్ అనేది దేశంలో ప్రతి ఒక్కరికీ అవసరం కదా.. అలాంటిది, దాన్ని రాజకీయం చేయడమేంటి.? బీహార్ ప్రజలకు తప్ప, దేశంలో ఎవరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వరా.? దీనర్థం, దేశ ప్రజల్ని వేరుగా, బీహార్ ప్రజల్ని వేరుగా బీజేపీ చూస్తున్నట్లే కదా.? అంటూ చాలా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, అది ఆ రాష్ట్రానికి సంబంధించి తమ పార్టీ శాఖ తీసుకున్న ఎన్నికల నిర్ణయం మాత్రమేనని చెప్పుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా చాలామంది బీజేపీ నేతలు తంటాలు పడాల్సి వచ్చింది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సందర్భంగా కూడా ఈ విషయం చర్చకు వచ్చింది. ఇంతకీ, కరోనా వ్యాక్సిన్.. దేశంలో అందరికీ ఉచితంగా ఇస్తారా.? లేదా.? అలా ఇవ్వడాన్ని మోడీ సర్కార్ ఓ బాధ్యతగా భావిస్తుందా.? లేదా.? అన్న ప్రశ్నలు మళ్ళీ తెరపైకొచ్చాయి.
అందరికీ అక్కర్లేదా.? ఇదెక్కడి వింత.?
కరోనా పాజిటివ్ కేసులు దేశంలో తగ్గుముఖం పట్టాయి. అయితే, అధికారిక లెక్కలకీ, అనధికారిక లెక్కలకీ పొంతన లేకుండా పోయింది. కరోనా మరణాల విషయంలోనూ ‘దాపకరికం’పై భిన్న వాదనలున్నాయి. అలాంటప్పుడు, కరోనా వ్యాక్సిన్ కొందరికి మాత్రమే అవసరమనీ, అందరికీ అవసరం లేదనీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. కొందరిలో కరోనా వైరస్ వచ్చినా వెంటనే తగ్గిపోతోంది. మరికొందరిలో అది చాలా తీవ్రంగా మారుతోంది. యుక్త వయస్కులు కూడా హఠాత్తుగా చనిపోతున్నారు. కొందరిలో కరోనా తగ్గినా, ఆ తర్వాత సమస్యలు చాలాకాలంగా వెంటాడుతున్నాయి. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే, కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనది అన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు.
వ్యాక్సిన్ తప్పనిసరి.. నో డౌట్.!
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు కరోనా వైరస్‌పై పోరు కోసం వ్యాక్సిన్ రావాలని కోరుకుంటున్నాయి.. కోరుకోవడమే కాదు, తమ దేశంలో ప్రజలందరికీ ఉచితంగా అందించేందుకూ సమాయత్తమవుతున్నాయి. పేద దేశాలు సైతం, తమ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ని ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు రచించుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం. మన దేశంలోనూ ఇదే ఆశ పెట్టిన నరేంద్ర మోడీ సర్కార్, ఇప్పుడేమో, ‘అందరికీ అవసరం లేదు’ అని తేల్చేస్తుండడం గమనార్హం.
కష్టమేగానీ, తప్పదు కదా.!
130 కోట్ల మంది జనాభా వున్న దేశంలో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నిజానికి ఇది పెను సవాల్. అయితే, కరోనా వైరస్ అనేది ఊహించని విపత్తు. ఈ విపత్తు నుంచి జనాన్ని కాపాడటం అనేది పాలకుల బాధ్యత. పబ్లిసిటీ కోసం వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలకి, ప్రజల ప్రాణాల్ని రక్షించే క్రమంలో వ్యాక్సిన్‌ని అందరికీ ఉచితంగా ఇవ్వడం అనేది ఓ బాధ్యత. ఆ బాధ్యతను నరేంద్ర మోడీ సర్కార్ విస్మరిస్తుందా.? అంటే, విస్మరిస్తే మాత్రం.. దేశ ప్రజల్ని మోడీ మోసం చేసినట్లేనన్న విమర్శలు విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.