టి.బీజేపీలో ఏమి జరుగుతుంది… బండి సంజయ్ బై బై?

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అసంతృప్తితో ఉన్నారా..? సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..? రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. తన పని తాను చూసుకోబోతున్నారా..? పార్టీలో తనకు సముచిత గౌరవం దక్కడం లేదనే ఆవేదన ఆయనలో పుష్కలంగా ఉందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది! కొద్దిరోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆవేదనకు లోనవుతున్నారని తెలుస్తోంది.

అవును… తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్… కొద్దిరోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆవేదనకు లోనవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాలకు గుడ్‌ బై చెప్పే ఆలోచన చేస్తున్నారని ఆయన అభిమానుల నుంచి వినిపిస్తోన్న మాట. పైగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన నేపథ్యంలో… సంజయ్ కి సంబంధించి ఇలాంటి కథనాలు వస్తుండటం చర్చనీయాంశం అయ్యింది.

గతకొంతకాలంగా పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ల‌భించ‌డం లేదనే నిరాశలో బండి సంజయ్ ఉన్నారని.. ముఖ్యంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత పార్టీలో క్రమంగా తన ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందని సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో తనకు అసెంబ్లీకి పోటీ చేయడం ఇష్టం లేకపోయినా.. పార్టీ తన పేరును కరీంనగర్‌ స్థానం నుంచి ప్రతిపాదించడంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తుంది.

అయితే దీనితోపాటు ఇటీవల విడుద‌ల చేసిన ఫస్ట్‌ లిస్ట్‌ లోనూ తాను సూచించిన వారికి టికెట్లు దక్కకపోవడంతో బండి ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తుంది. అందులో భాగంగా… కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడ, హుస్నాబాద్‌ స్థానాలను పెండింగ్‌ లో పెట్టడాన్ని బండి సంజయ్‌ తీవ్రంగా పరిగణిస్తున్నారని సమాచారం. కారణం.. ఈ స్థానలలో బండి కొన్ని పేర్లు ప్రస్థావించారట.

ఇందులో భాగంగా… ప్రధానంగా వేములవాడలో మాజీ గవర్నర్ విద్యాసాగర్‌ రావు కొడుక్కి టికెట్ ఇవ్వాలని బండి సంజయ్ కోరుతున్నారు. అయితే ఇదే స్థానంలో ఈటల రాజేందర్ మరోపేరు డిమాండ్ చేస్తున్నారు. తన వెంట బీజేపీలో చేరిన తుల ఉమాకి టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ కారణాలవల్లే వేములవాడ స్థానాన్ని పెండింగ్‌ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయాలకు గుడ్‌ బై చెప్పి.. హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాలని బండి సంజయ్‌ నిర్ణయించారని అంటున్నారు.

మరోపక్క బీజేపీలో అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్ పార్టీలో అంతర్గతంగా పెద్ద చిచ్చే రేపిందని అంటున్నారు. దీంతో… టికెట్ దక్కని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా… టికెట్‌ ఆశించి భంగపడిన పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇందులో భాగంగా… తాజాగా ముథోల్‌ టికెట్ ఆశించిన రమాదేవి నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

అనంతరం స్పందించిన ఆమె… తనకు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపిస్తూ బోరున విలపించారు. ఇక పటాన్‌ చెరులోనూ తనకు టిక్కెట్ కేటాయించలేదంటూ నందీశ్వర్‌ గౌడ్‌ తోపాటు స్థానిక నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరి ఇలాంటి అసంతృప్తులు, కొత్త తలనొప్పులు ఇంకెన్ని తెరపైకి వస్తాయనేది వేచి చూడాలి!