మొన్న ప్రజారాజ్యం – నిన్న జనసేన.. లాజిక్ మిస్సవుతున్న టీడీపీ నేత!

ఒక పార్టీ పోటీ చేయడం వల్ల మరో పార్టీ ఓడిపోవడం ఏమిటో టీడీపీ నేతలకే తెలియాలి. 2009లో ప్రజారాజ్యం పార్టీ వల్ల, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ వల్లా తమ పార్టీ ఓడిపోయిందని చెప్పుకుంటూ, తమ తప్పులను కవర్ చేసుకునే పనికి పూనుకున్నారు టీడీపీ సీనియర్ నేత. ఒకపక్క టీడీపీ – జనసేనల పొత్తుపై తీవ్ర చర్చలు నడుస్తున్న నేపథ్యంలో, ఈ విషయంలో తన ఆసక్తిని పవన్ ఏనాడో పబ్లిక్ గా చెప్పేసిన తరుణంలో… తాజా ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అవును… భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథం పేరుతో టీడీపీ నాయకులు చేపట్టిన ఉత్తరాంధ్ర బస్సు యాత్ర టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన సభలో మైకందుకున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ రెండుసార్లు ఓడిపోయిందని చెప్పుకొచ్చారు.

2009లో టీడీపీ ఆధ్వర్యంలోని మహాకూటమి గెలిచే అవకాశం ఉందని అందరూ భావించారని.. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి టీడీపీకి ఓటమి ఎదురైనట్లు చెప్పారు. ఆ తర్వాత 2019లో కూడా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన వల్ల టీడీపీకి ఓటమి ఎదురైందన్నారు.

ఇలా ఆ ఇద్దరు అన్నదమ్ముల వల్ల టీడీపీ 2009, 2019లో రెండుసార్లు ఓటమి ఎదుర్కుందని సత్యనారాయణమూర్తి చెప్పారు. ఇదే సమయంలో… వీరు గెలవరు.. ఇతరులను గెలవనివ్వరు.. అన్న చందంగా పరిస్థితులు తయారు చేశారని కామెంట్ చేయడం గమనార్హం.

అయితే ఈ కామెంట్లపై బండారుకి ఒక స్పష్టత ఇస్తున్నారు విశ్లేషకులు. 2009లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రజారాజ్యం వల్ల చీలిపోయిందని చెబుతున్న బండారు… 2019లో పవన్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం వల్లే టీడీపీ ఓడిపోయిందని చెప్పదలుచుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు.

అంటే… 2009లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ప్రజారాజ్యం చీల్చడం వల్ల టీడీపీ ఓడిపోతే… 2019 ఎన్నికల నాటికి అధికారంలో ఉన్నది టీడీపీ. అప్పుడు జనసేన పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి… మళ్లీ టీడీపీనే గెలవాలి. అలా కాకుండా… ప్రత్బుత్వ వ్యతిరేక ఓటును పవన్ చీల్చినా కూడా.. వైసీపీ గ్రాండ్ విక్టరీ ఎలా సాధించిందో బండారుకే తెలియాలి.

ఆడలేక మద్దెల ఓడ అన్నట్లుగా… ఓటమి అనంతరం ప్రజల ఆగ్రహానికి గురవ్వడానికి గల కారణాలను విశ్లేషించుకోవడంపై ఆసక్తి చూపించని టీడీపీ నేతలు… ఇలా ఓడిపోయిన ప్రతీసారి ఏవేవో లాజిక్కులు లాగుతుంటారు! మరి 2024 ఎన్నికల తర్వాత ఏమి చెబుతారో వేచి చూడాలని ఈ సందర్భంగా కామెంట్లు వినిపిస్తుండటం కొసమెరుపు!