శ్రావణ మాసంలో ఇంట్లో ఈ మొక్కలు నాటితే.. ఏమవుతుందో తెలుసా..?

హిందూ సాంప్రదాయం ప్రకారం.. శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన కాలం. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ కాలంలో భూమి సమృద్ధిగా పచ్చదనం కప్పుకొని ప్రకృతి పునర్జీవనం పొందుతుంది. ఇదే సమయంలో దేవతలకు సంబంధిత వ్రతాలు, పూజలు ఎక్కువగా జరిపే పవిత్ర సమయం కూడా. శ్రావణం శివుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ఈ మాసంలో శివారాధన, పూజలు, జలాభిషేకాలు విశేషంగా జరుపుతారు. శ్రావణంలో ప్రతీ మంచి కార్యానికి మొదలు పెట్టడం శుభ సూచకంగా భావిస్తారు. ఇదే సమయంలో ఇంటి చుట్టూ పవిత్ర వృక్షాలను నాటితే శివ కటాక్షం మరింత బలపడుతుందని పెద్దలు చెబుతారు. ఈ మొక్కలు ఇంటి పరిసరాల్లో శుభ వాతావరణాన్ని సృష్టించి, ఆరోగ్యానికి తోడ్పడతాయి.

బిల్వ వృక్షం: శైవ సంప్రదాయంలో బిల్వ వృక్షానికి ఉన్నత స్థానం ఉంది. బిల్వదళాలను శివలింగానికి సమర్పించడం అపార పుణ్యప్రదం. ఇంటి ఆవరణలో బిల్వ వృక్షాన్ని నాటితే దారిద్ర్యం తొలిగి సౌఖ్యం, ఐశ్వర్యం కలుస్తుందని పండితులు చెబుతున్నారు.

తులసి మొక్క: తులసి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది. శ్రావణంలో తులసిని నాటి ప్రతిరోజూ దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ధనసంపత్తి, సానుకూల శక్తి పెరుగుతాయని నమ్మకం ఉంది. గాలి పరిశుద్ధతకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

శమీ వృక్షం: శని దేవుడు, శివుడు ఇద్దరికీ ప్రీతికరమైన శమీ వృక్షాన్ని శ్రావణంలో నాటడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. శని దోష నివారణ, ఆధ్యాత్మిక రక్షణ కోసం ఇది ఎంతో శుభప్రదమని చెబుతున్నారు.

తెల్ల జిల్లేడు: తెల్ల జిల్లేడు పువ్వులను శివలింగానికి సమర్పించడం శ్రేయస్కరంగా భావిస్తారు. ఈ మొక్కను ఇంటి చుట్టూ నాటితే విజయం, ధనం, శివ అనుగ్రహం లభిస్తాయని నమ్మకం.

ధతూరా మొక్క: ధతూరా పువ్వులు, పండ్లు శివుడి పూజకు అత్యంత ప్రీతికరం. ఈ మొక్క ఇంటి వద్ద ఉంటే దురదృష్టం తొలగి శత్రువులపై విజయం, సంపదలో వృద్ధి జరుగుతుందని చెప్పబడుతుంది.

శ్రావణ మాసం భక్తి, భౌతిక శుద్ధి, ప్రకృతితో సమైక్యం కలిగే మంచి సమయం అంటారు. ఈ కాలంలో పవిత్ర మొక్కలను నాటడం మన భక్తి తతంగాన్ని బలపరుస్తూ శాంతి, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది.