ఆంధ్రప్రదేశ్ లో కులాభిమానం, కులద్వేషాలు ఉన్నాయేమో కానీ, మతవిద్వేషాలు మాత్రం ఇంతవరకూ లేవు. మతభావనాలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగినప్పటికీ ప్రజలు మాత్రం ఏనాడూ ప్రతిస్పందించిన దాఖలాలు లేవు. గత కొద్దికాలంగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతభావనలను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత దేవాలయాల మీద దాడులు జరగడం, విగ్రహాలను ధ్వంసం చెయ్యడం ఎక్కువగా జరుగుతున్నాయి. అంతకుముందు లేవా అని అడగద్దు. అయిదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల వేయికాళ్ల మండపాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ధాక్షిణ్యంగా కూలగొట్టించాడు. విభాజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పుష్కరాల పేరుతో సుమారు నలభై పురాతన ఆలయాలను బుల్డోజర్లు పెట్టి లేపేసిన మహా అభివృద్ధి చోదకుడు చంద్రబాబు. పైగా ఆ పవిత్రమైన ఆలయాల స్థానంలో ఆయన కట్టించింది అమరావతి నగరం కాదు…మరుగుదొడ్లు! వింటానికే అసహ్యంగా ఉన్నది కదూ! ఇక ఆయన ఏలుబడిలోనే తిరుమల ఆలయంలో అనేక అపచారాలు సంభవించాయి. ఏవో గుప్త నిధులు ఉన్నాయని వంటశాలను తవ్విపారేశారు. ఇక పశ్చిమగోదావరి జిలాలో ఏదో ఆలయంలో రధాన్ని తగలబెట్టేశారు. ఇక చంద్రబాబు నాయుడు పవిత్రమైన పూజా కార్యక్రమాల్లో సైతం తన పాదాలంకారాలు….అవేనండి…ఆయన చర్మంలో చర్మంగా కలిసిపోయిన బూట్లు మాత్రం విప్పరు..నిన్న చూడండి..రామతీర్ధం కొండ మీదకు ఎక్కే మెట్లదారిలో ఆయన వయసుతో సమానుడైన ఎంపీ విజయసాయిరెడ్డి రిక్తపాదాలతో ఎక్కితే, వీరభక్తుడు చంద్రబాబు మాత్రం తన పాదగండపెండేరాలను మాత్రం విప్పలేదు. ఆయనేకాదు..ఆయనతో మెట్లు ఎక్కిన అచ్చెన్నాయుడు కూడా అలాగే అధిరోహించారు.
ఏనాడూ కుంకుమ ధరించని చంద్రబాబు ఈనాడు….
సరే..అది వారిష్టం అనుకుందాము. సాధారణంగా మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే పార్టీగా బీజేపీకి గొప్ప పేరుంది. కానీ, విచిత్రంగా రామతీర్ధం సంఘటనపై బీజేపీ వారికంటే చాలా ముందుగా చంద్రబాబు స్పందించారు. ఏనాడూ తన జీవితంలో శుభకార్యానికైనా, పూజా కార్యక్రమాలకైనా, నుదుట కుంకుమ ధరించని చంద్రబాబు రూపాయి కాసంత కుంకుమ బొట్టుతో దర్శనం ఇచ్చారు. ఇప్పుడే కాదు…మోడీతో సున్నం పెట్టుకున్న తరువాత ప్రజలంతా చంద్రబాబు ఎముకల్లో సున్నం లేకుండా చావగొట్టి తరిమేసిన క్షణం నుంచి మోడీ గారి కరుణాకటాక్ష వీక్షణాలకోసం పరితపిస్తున్న నిముషం నుంచి బీజేపీ పెద్దల దృష్టిలో పడటానికి అయన అవసరం ఉన్నా లేకపోయినా నుదుట కుంకుమను ధరిస్తూ ఆ కుంకుమకే అపఖ్యాతి తెస్తున్నారు.
ఆరోపణలతో కార్యం నెరవేరదు
ఇక ఈ సంఘటన వెనుక వైసిపి ఉన్నదని టిడిపి, టిడిపి ఉన్నదని వైసిపి, టిడిపి, వైసిపి ఉన్నాయని బీజేపీ పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఎవరి హస్తాలు ఉన్నాయో తేల్చాల్సింది ప్రభుత్వం, పోలీసులు మాత్రమే. తోటకూర సామెత నాడే సామెత చెప్పినట్లు ఒకటి రెండు దుర్ఘటనలు జరిగినప్పుడే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించినట్లయితే మళ్ళీ ఇలాంటివి జరిగేవి కావు. కానీ, ప్రభుత్వం ఈ విషయంలో ఆలస్యం చేసింది. అదే ఇప్పుడు మతద్రోహులకు వరప్రసాదంగా మారింది. ఇకనైనా ప్రభుత్వం అప్రమత్తమై ఆలయాలమీద దాడులు చేస్తున్నవారు ఏ పార్టీ వారైనా అరెస్ట్ చేసి బోనెక్కించాలి. లేకపోతె ప్రతిపక్ష కుతంత్రాలకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తెలుగుదేశం వారు చేశారు అని ఆరోపిస్తే సరిపోదు. సాక్ష్యాధారాలతో సహా పట్టుకోవాలి. అప్పుడే జనంలో విశ్వాసం పెరుగుతుంది.
ఇక ఇలాంటి సంఘటనల వలన రాజకీయప్రయోజనం ఎవరికి ఒనగూరుతుంది? అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రజల మనోభావాలను కించపరచి తన ప్రాభవాన్ని తగ్గించుకోదు. ఏమాత్రం కామన్సెన్స్ ఉన్నా ఈ లాజిక్ సులభంగానే అర్ధం అవుతుంది. రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని బీజేపీ ఇంత సాహసానికి తెగబడుతుందంటే నమ్మటం కష్టం. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేని చంద్రబాబుకు మాత్రమే ఇలాంటి బరితెగింపుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి దుర్ఘటనలవలన ఎవరికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుందో ప్రజలు కూడా ఆలోచించాలి. అయితే ఆరోపణలు చేసినంత మాత్రాన దోషి అని చెప్పలేము. లోతుగా విచారించి నేరస్తులను పట్టి పల్లార్చవలసిన బాధ్యత అధికారంలో వైసీపీదే.
ఇళ్ల స్థలాల కార్యక్రమ సంబరాలను డైవర్ట్ చెయ్యడానికే
ఇక ఇలాంటి దుర్ఘటనలు గత కొద్దికాలంగా జరుగుతున్నప్పటికీ తెలుగుదేశం నిన్న రామతీర్థంలో చేసినంత రచ్చ ఎందుకు చెయ్యలేదు? వైసిపి వారు చెబుతున్న దాని ప్రకారం రాష్ట్రం మొత్తం ఇళ్ల స్థలాల పంపిణీ జరుగుతున్నది. లబ్ధిదారులు అందరూ జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతున్నారు. ఆ వార్తలను ఒక్క నిముషం కూడా ప్రసారం చెయ్యని పచ్చ మీడియా చంద్రబాబు రామతీర్ధయాత్రను మాత్రం రోజంతా ప్రసారం చేసాయి. పైగా చంద్రబాబుకు లభిస్తున్న ప్రజాదరణను చూసి బీజేపీ అగ్రనేతలు హాశ్చర్యపోతూ బుగ్గలు నొక్కుకుంటున్నారని చంద్రబాబుకు చిడతలు కొడుతున్నాయి. చంద్రబాబు లక్ష్యం ఏమిటో అర్ధం కాలేదా మరి! ఇళ్ల స్థలాల పంపిణీ సంరంభాన్ని కప్పి పుచ్ఛి ప్రజల మనసులను డైవర్ట్ చెయ్యడం కోసమే తెలుగుదేశం ఇలాంటి డ్రామాలు నడిపిస్తున్నది అంటూ వైసిపి నాయకులు నిప్పులు చెరుగుతున్నారు.
ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి
ఏదేమైనప్పటికీ ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా నిలువరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వారి దుష్ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మరులే అని అతివిశ్వాసం మంచిది కాదు. తినగతినగ వేము తియ్యనుండు అని వేమన చెప్పినట్లు వినగా వినగా అబద్ధాలే నిజాలనిపిస్తాయి. అలాంటివాటిలో చంద్రబాబు నిపుణుడు అని అందరికీ తెలిసిందే. తస్మాత్ జాగ్రత…
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు