ఫేమస్ అవ్వాలని చంపేశారంట… జై శ్రీరాం!

యూపీ గ్యాంగ్‌ స్టర్‌, పొలిటీషియన్‌ అతీక్ అహ్మద్.. అతని సోదరుడు అష్రఫ్‌ లను మీడియా, పోలీసుల సాక్షిగా ముగ్గురు యువకులు శనివారం రాత్రి పాయింట్‌ బ్లాంక్‌ లో కాల్చిచంపిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనంగా మారింది. దీంతో… యూపీ ముఖ్యమంత్రిపై విమర్శల వర్షాలు కురుస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భద్రత ఏస్థాయిలో ఉందనేది తెలుస్తుందని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. అయితే… కాల్పుల అనంతరం వీరిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. లవ్లేశ్‌ తివారీ, సన్నీ, అరుణ్‌ మౌర్యగా గుర్తించారు.

అయితే ఈ ముగ్గురిని అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులకు షాకింగ్ విషయాలు చెప్పారు ఈ యువకులు. అవును… కేవలం ఫేమస్ కావాలనే అతీక్ అహ్మద్‌ ను షూట్ చేసినట్లు వీరు పోలీసులకు తెలిపారు! అందుకోసమే… పక్కా ప్లాన్ ప్రకారం పిస్టళ్లతో వెళ్లి, పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపినట్లు చెబుతున్నారు. అయితే… కాల్పుల అనంతరం ఘటనా స్థలంలోనే ముగ్గురు యువకులు “జై శ్రీరాం” అని నినాదాలు చేయడం గమనార్హం! దీంతో… ఈ వ్యవహారంపై రకరకాల విశ్లేషణలు తెరమీదకొస్తున్నాయి.

ఈ క్రమంలో ఈ విషయాలపై స్పందించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ… పోలీసులు మీడియా సమక్షంలో ఓ ఆస్పత్రి ఆవరణలో అతిక్ అహ్మద్ అతడి సోదరుడిని కాల్చి చంపడం చూస్తుంటే… యూపీలో జంగిల్ రాజ్ నడుస్తున్నట్లు అనిపిస్తుందని.. శాంతి భద్రతలను కాపాడలేని యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దోషులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలోనే కాల్పులు జరిపిన వారిని ఉగ్రవాదులుగా ప్రకటించాలని చెప్పారు.

కాగా… అతీక్‌ పై 100కు పైగా క్రిమినల్‌ కేసులున్నాయి. 2005 నాటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకు ప్రధాన సాక్షి ఉమేశ్‌ పాల్‌ ను హత్య చేసిన కేసులో.. విచారణ నిమిత్తం అతీక్‌ సోదరులను పోలీసులు ఇటీవలే అహ్మదాబాద్‌ సెంట్రల్‌ జైలు నుంచి ప్రయాగ్‌ రాజ్‌ కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో… వైద్య పరీక్షల నిమిత్తం శనివారం రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో పోలీసులు అతీక్ సోదరులను ఎం.ఎల్.ఎన్. వైద్య కళాశాలకు తరలించారు. చేతులకు బేడీలతో ఉన్న సోదరులిద్దరూ అక్కడికి చేరుకున్న మీడియాతో మాట్లాడుతూ ముందుకు నడుస్తుండగా.. రెప్పపాటులో మీడియా ముసుగులో వారితో పాటు నడుస్తున్న ముగ్గురు యువకులు ఉన్నట్టుండి పిస్టళ్లు తీశారు. నేరుగా వారిపైకి కాల్పులకు దిగారు. దీంతో సోదరులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే!

యూపీలో గ్యాంగ్ స్టర్స్  అతీక్ అహ్మద్, అష్రఫ్ హతం | Gangsters killed in UP | hmtv