ఆసియా కప్ లో టీమిండియా బోణీ.. యూఏఈపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం..!

ఆసియా కప్ 2025కు టీమిండియా సత్తా చూపుతూ.. అద్భుత విజయంతో శుభారంభం చేసింది. బుధవారం (సెప్టెంబర్ 10) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బౌలింగ్‌లో ఆతిథ్య జట్టును కుప్పకూల్చిన భారత్, అనంతరం బ్యాటింగ్‌లో అదరగొట్టి కేవలం 4.3 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు టీమిండియా బౌలర్ల ధాటికి నిలువలేక 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. యూఏఈ తరఫున అలీషన్ షరాఫు 22 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోర్ అందుకోలేకపోయారు. ముఖ్యంగా చివరి 8 వికెట్లు కేవలం 10 పరుగుల వ్యవధిలో పడిపోవడం ఆతిథ్య జట్టుకు భారీ షాక్‌గా మారింది.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా, శివమ్ దూబే 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. స్పిన్, పేస్ కలయికతో భారత్ బౌలింగ్ యంత్రాంగం యూఏఈని పూర్తిగా సతమతం చేసింది. పవర్‌ప్లే తర్వాత కుల్దీప్ యాదవ్ ఒక్కసారిగా మూడు వికెట్లు తీసుకోవడంతో యూఏఈ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

తర్వాత లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి బంతికే సిక్స్ కొట్టి తనదైన స్టైల్‌లో ఇన్నింగ్స్ ఆరంభించాడు. కేవలం 16 బంతుల్లోనే 30 పరుగులు బాదిన అభిషేక్ శర్మ ఒక వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక శుభ్‌మన్ గిల్ (20 నాటౌట్) బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. భారత్ కేవలం 4.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి టార్గెట్ ఛేజ్ చేసింది. ఈ విజయంతో ఆసియా కప్‌లో భారత్ సత్తా చూపించింది. ఇక ముందున్న మ్యాచ్‌ల్లో కూడా ఈ దూకుడు కొనసాగిస్తుందనే నమ్మకం అభిమానుల్లో నెలకొంది.