కోరమండల్ దుర్ఘటన కుట్రే… వివరాలివి!

ఒడిసాలోని బాలాసోర్‌ జిల్లా బహానగ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన వందల కుటుంబాల్లో విషాదం మిగిల్చిన సంగతి తెలిసిందే. దేశ రైల్వే చరిత్రలో ఇది భారీ ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ దుర్ఘటన నిజంగా ప్రమాదమేనా.. లేక, ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే ఊహాగాణాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కీలక విషయాలు వెళ్లడించారు రైల్వే మంత్రి!

ఒడిసాలోని బాలాసోర్‌ జిల్లా బహానగ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఇది ప్రమాదం కాదని, సిగ్నలింగ్‌ వ్యవస్థలో మార్పుల వల్లే ఈ ఘోరం జరిగిందని తెలిపారు. దీనిలో కుట్ర కోణం ఉండొచ్చని పరోక్షంగా స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థను మార్చడమే ప్రమాదానికి కారణమని మంత్రి చెబుతున్నారు.

పాయింట్‌ మెషిన్‌ సెట్టింగ్‌ లు ఎవరో మార్చివేశారని రైల్వే మంత్రి ఆరోపిస్తున్నారు. అయితే వారిని ఇప్పటికే గుర్తించామని చెబుతున్న మంత్రి అశ్వినీ వైష్ణవ్… త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంలో మరిన్ని వివరాలు తెలియడానికి ఈ ప్రమాదంపై సీబీఐ విచారణకు సిఫారసు చేశామని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో ఈ ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్‌ దర్యాప్తు చేశారని, సమగ్ర నివేదిక రాగానే అన్ని విషయాలూ తెలుస్తాయని మంత్రి చెప్పారు.

అవును… “మా విచారణ పూర్తయింది. ఘోరకలికి మూల కారణమేమిటి, దానికి బాధ్యులు ఎవరనేది తేలింది. పాయింట్‌ మెషీన్‌ సెట్టింగ్‌ ను మార్చడం వల్లే ఇది జరిగింది. ఈ క్రిమినల్‌ చర్యను ఎందుకు, ఎలా చేశారనేది రైల్వే భద్రత కమిషనర్‌ (సీఆర్‌ఎస్‌) దర్యాప్తు నివేదికలో బయటపడుతుంది. అందువల్ల నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్లను. రైళ్లు ఢీకొనకుండా నివారించే కవచ్‌ వ్యవస్థకు, ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు” అని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు.

దీంతో ఈ వ్యవహారంపై రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఉగ్రకోణం కూడా ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పూర్తి విచారణ జరిగిన అనంతరం ఈ దుర్ఘటన వెనకున్న పూర్తి వివరాలు తెలియబోతోన్నాయన్నమాట!

కాగా… ఒడిషా రైలు ప్రమాద ఘటన వెనుక కుట్రకోణం ఉండొచ్చని.. ఈ విషయంపై కేంద్రం సమగ్ర విచారణ జరిపించాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే! ఆమె అనుమానించినట్లుగానే… రైల్వే మంత్రి కూడా ఈ విషయంపై స్పందించారు!