`క‌రోనా` కంటే క్యాపిట‌లిస్టులు ప్ర‌మాద‌కారులా?

Covid - 19

మ‌నిషిలో భ్రమలు తొలిగి బలాలు, బలహీనతలు స్పష్టంగా అర్థమవుతున్న సమయమిది.! క‌రోనా క‌ల్లోలం బోలెడ‌న్ని పాఠాల్ని నేర్పిస్తోంది. పేద‌ల‌కు క్యాపిట‌లిస్టుల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న వార్ ని కూడా ఇది బ‌య‌టికి తెచ్చింద‌న‌డంలో సందేహ‌మేం లేదు. మొన్న విశాఖ‌-గోపాల‌ప‌ట్నం స్టెరీన్ గ్యాస్ లీక్ దుర్ఘ‌ట‌న త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా మ‌రోసారి క్యాపిట‌లిస్టు పెత్త‌నంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది.

క్యాపిటలిజం అంటేనే స్వార్థం. మనిషిలో స్వార్థం పుట్టినప్పుడు పుట్టి, మనిషికి నీడలా ఎదిగింది. దాన్ని రాజుల కాలంలో ఫ్యూడలిజమన్నారు. ఆ తరువాత బూర్జువాలు, జమీందార్లు, భూస్వాములు, పెట్టుబడిదార్లు ఇలా దాని రూపాల్ని రకరకాలుగా మార్చుకుంటూ దాని ఉనికిని మనిషిలో సుస్థిరం చేసుకుంది. ప్రపంచాన్ని క్యాపిటలిజం, కమ్యూనిజం ప్రభావితం చేసినంతగా మరో ఇజం లేనే లేదు.

సమాజంలో ఉన్న ప్రజలు, రచయితలు, సామాజిక వేత్తలు, మేధావులు ఈ రెండు సిద్ధాంతాల మధ్య నలుగుతుంటారు. నడుస్తుంటారు. కొందరు `కమ్యూనిజం` (మార్క్సిజం) అంటే.? ఇంకొందరు `క్యాపిటలిజం` (పెట్టుబడీదారివర్గం) అంటారు. అసలు ఈ రెండు ఇజాలు ఏం చెప్పాయో? ఏం ఉద్ధరించాయో? చర్చిస్తూనే కరోనా ఇజం ఎలా పుట్టిందో అర్థం చేసుకోవాలి. ఈ రెండు సిద్ధాంతాలు మనుషుల్ని ఉత్తర – దక్షిణ ధృవాల్లా మార్చాయి. సామాన్య ప్రజలు కూడా వాళ్ళకే తెలియకుండా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ సిద్ధాంతాలనే అనుసరిస్తారు.

అసలు కమ్యూనిజం లోతుల్లోకి వెళితే.. ఫిబ్రవరి 1848 కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ లు కమ్యూనిస్టు ప్రణాళికను ప్రపంచానికి అందజేశారు. మానవ చరిత్ర గమనాన్ని దీనంతగా ప్రభావితం చేసిన మరో పత్రమేదీలేదు. ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ప్రజా పోరాట రూపాలకు కార‌కం క‌మ్యూనిజం. కార్మికుల్ని యాజమానులు దోచుకుంటున్న విధానాన్ని ఖండిస్తూ, శ్రమసమానత్వాన్ని బోధిస్తూ పుట్టుకొచ్చిన సిద్ధాంతమే కమ్యూనిజమని చెప్పవచ్చు. కమ్యూనిజం ప్రారంభ దశని సోషలిజం అనీ అన్నారు.

పెట్టుబడిదారీ వర్గం చేతిలో వున్న రాజ్యాధికారాన్ని కార్మికవర్గం తీసుకుని, తన పరిపాలన ప్రారంభించగానే అది కమ్యూనిజం అవదు. లేదా అది, సోషలిజం కూడా అవదు. భూస్వాముల చేతుల్లో వున్న భూమి హక్కునీ, పెట్టుబడిదారుల చేతుల్లో వున్న ఇతర ఉత్పత్తి సాధనాల హక్కుల్నీ రద్దు చేసే క్రమం ప్రారంభమైన రోజు నించే సోషలిజం ప్రారంభమైనట్టు.

రెండో ప్ర‌పంచ యుద్ధ కాలం త‌ర్వాత మొద‌లైన సోష‌లిజం- కమ్యూనిజం ఇప్ప‌టికీ భార‌త‌దేశంలో ఎద‌గ‌లేదు. 2020 లో అంటే సుమారుగా 172 సంవత్సరాల తరువాత కూడా మార్క్స్ కలగన్న కమ్యూనిజం ఫలించలేదు. రష్యా – చైనాలో పుట్టి ఇండియాలో ప్ర‌వేశించినా ఇక్క‌డా మ‌నుగ‌డ లేక‌పోవ‌డం శోచ‌నీయం. కమ్యూనిజం చాలా గొప్ప సిద్ధాంతం కానీ, దాన్ని ఆచరిస్తున్న నాయకులే బలహీనులు.! ఊసర‌వెల్లి లాంటి మనుషులు నిర్మించిన రాజకీయ పార్టీల ముందు సిద్ధాంతాలు నిర్మించిన పార్టీలు నిలబడలేకపోతున్నాయి. నేటి వర్కర్స్ యూనియన్స్, పనిగంటల లెక్కింపు, కార్మిక భీమాపథకాలు ఇలా చాలా సౌకర్యాలు మార్క్స్ కలగన్న కమ్యూనిజం చలవే. సాధారణ కార్యకర్తల మీద నాయకుల పెత్తనం యజమాని, బానిస తంతునే గుర్తుచేస్తుంది!

రాజ్యాధికారంలోకి రావాల్సిన కమ్యూనిస్టులు ఎందుకు ఇంతకాలం వెనుకబడిందంటే.? `వ్యక్తి స్వేచ్ఛ అనేది బూర్జువా వర్గపు కుటిల వాదమని, అది పెట్టుబడిదారీ దోపిడీ విధానానికి మారు పేరు అని కమ్యూనిస్టులు నమ్మారు. వ్యక్తికి, సమిష్టికి సమన్వయాన్ని సాధించడానికి బదులు, వ్యక్తిని అణగదొక్కి సమిష్టికి ప్రాధాన్యం ఇచ్చారు. సమిష్టి పేరుతో పార్టీ, పార్టీ పేరుతో కొద్దిమందితో కూడిన పాలకమండలి.. ఆ మండలి పేరుతో ఒక వ్యక్తి నియంతృత్వం చెలాయించడం అల‌వాటుగా మారింది.

అసలు కమ్యూనిజం రావాలంటే.? విపరీతమైన నియంతృత్వ పోకడలు పాలకుల్లో ఉండాలి. అప్పుడు సమాజంలో అసహనం పెరిగి ఉద్యమాలకు దారి తీస్తుంది. అప్పుడది కమ్యూనిజం వైపుకు నడుస్తుంది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు నడుస్తునంత కాలం ఏ దేశంలో అయినా కమ్యూనిజం రావడానికి అవకాశం లేదన్న విశ్లేష‌ణ ఉంది. కార్మికుల పేదరికానికి దోపిడీదారి వర్గం కారణమైనా ఆ వర్గం తయారు చేస్తున్న ఉత్పత్తులు వాడకుండా వాళ్ళపై పోరాటం చేయడ‌మే స‌రైన మార్గం.

“20 సంవత్సరాల వయసులో కమ్యూనిస్టువి కాకపోతే నీకు హృదయం లేనట్టు. అదే 30 సంవత్సరాల వయసులో క్యాపిటిలిస్టువి కాకపోతే నీకు మెదడు లేనట్టు“ అనే ఈ బెర్నాడ్ షా మాటలు చూస్తే క్యాపిటలిజాన్ని వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టులకు గెలుపు ఇంకెక్క‌డ‌. ఎందుకంటే కమ్యూనిస్టులకు, సామాజికవేత్తలకు సమసమాజ నిర్మాణంకోసం, సమానత్వ పోరాటాలు చేయ‌డ‌మే తెలుస్తుంది. త‌మ అనే స్వార్థం తెలీదు.

ప్రపంచాన్ని ప్రస్తుతం నడిపిస్తున్న క్యాపిటలిజం కరోనా ముందు చతికిలపడింది. జబ్బలు చ‌రిచిన అగ్రరాజ్యాలు కరోనా దెబ్బకి ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. అలాగే మతాలు కూడా ఇంతకాలం నోటికొచ్చినన్ని కబుర్లు చెప్పాయి. ఇలాంటి ఆపత్కాల పరిస్థితుల్లో రక్షిస్తాడనే కదా? ఇంతకాలం ఆ దేవుళ్ళని, మతాల్ని పూజించింది? ప్రార్ధించింది? మరి ఇలాంటి సమయంలో ఆ దేవాలయాలకు సెలవలంటే? అసలు మనం ఇంతకాలం చేసిన దానధర్మాలు ఎవరి ఖాతాలో చేరినట్లు.? అందుకే మనిషికి శాస్త్రీయ దృక్పథం, రేషనల్ థింకింగ్ చాలా అవసరం.

అసలు ఈ ‘కరోనాఇజం’ ఏమిటి? మార్క్స్ యిజంలా కరోనా యిజం కూడా ఒక వ్యక్తితో మొదలై ప్రపంచమంతా పాకుతుంది. ఒక ఇజం మనిషిని రక్షిస్తే, మరోఇజం మనిషిని భక్షిస్తుంది. ప్ర‌స్తుత క‌రోనా మ‌హ‌మ్మారీ పేద‌వాడు, ధ‌నికుడు అనే తేడా లేకుండా అంద‌రినీ ఆటాడుకుంటోంది. ప్ర‌భుత్వాల్ని .. ధ‌న‌దాహంతో ఉండే పెట్టుబ‌డిదారుల్ని ఫుట్ బాల్ ఆడేస్తోంది. ఇప్పటి వరకూ ఎన్ని వ్యాధులు వచ్చినా? మొత్తం ప్రపంచాన్ని ఐక్యంగా గడగడలాడించిన వ్యాధి కరోనాయే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కనక ఇది `కరోనాఇజం` అవుతుంది!

ప్రపంచం కరోనా వల్ల ఎదుర్కుంటున్న ఈ విషమ పరిస్థితుల్లో మన భ్రమలు తొలిగి మన బలాలు, బలహీనతలు ఇంకాస్త స్పష్టంగా అర్థమవుతున్న సమయమిది.! ఈనాటి మనిషి వస్తువుల్ని తన జాతిగా ప్రేమిస్తూ మానవస్పృహ లేకుండా బతికేస్తున్నాడు. ‘కరోనా’ మనలో ఉన్న పెట్టుబడిదారుణ్ణి, ఉద్యమకారుణ్ణి అణగదొక్కి మనిషి తనాన్ని నిద్రలేపి ప్రకృతి ప్రియత్వంవైపు, ఆరాధనవైపు దారి చూపుతుండ‌డం గ‌మ‌నిస్తున్న‌దే.