ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, ‘వ్యూహం’ సినిమాతో వార్తల్లో నిలిచిన దాసరి కిరణ్ కుమార్‌ను విజయవాడ పోలీసులు బుధవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. బంధువు వద్ద తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు ఆయనపై దాడి చేయించారన్న ఆరోపణలపై ఈ అరెస్ట్ జరిగింది. ప్రస్తుతం కిరణ్‌ను విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు.
కేసు వివరాల్లోకి వెళ్తే… పోలీసుల కథనం ప్రకారం, దాసరి కిరణ్ తన దగ్గరి బంధువైన గాజుల మహేష్ వద్ద రెండేళ్ల క్రితం రూ.4.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే, ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో జాప్యం చేస్తూ వచ్చారు. పలుమార్లు అడిగినా స్పందన లేకపోవడంతో, ఆగస్టు 18న మహేష్ తన భార్యతో కలిసి విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డబ్బు విషయం ప్రస్తావించగా, కిరణ్ తన అనుచరులతో వారిపై దాడి చేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడు మహేష్ విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న దాసరి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
దాసరి కిరణ్ కుమార్ ‘రామదూత క్రియేషన్స్’ బ్యానర్‌పై ‘జీనియస్’, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘వంగవీటి’, ‘సిద్దార్థ్’ వంటి చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఆర్జీవీ తీసిన ‘వ్యూహం’ సినిమాకు నిర్మాతగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులయ్యారు.
కిరణ్ కుమార్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యంగా వై.ఎస్. జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన టీటీడీ పాలకమండలి సభ్యునిగా కూడా నియమితులయ్యారు. ‘వ్యూహం’ సినిమా నిర్మాణ సమయంలో ఈ పదవి లభించడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.


