వైసీపీ నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టు నుండి గురువారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణంలో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఖండించింది. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం, సీఐడీ వాదనల ఆధారంగా తుది తీర్పు వెలువరించింది. మిథున్ రెడ్డికి ఈ కేసులో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.
సీఐడీ దాఖలు చేసిన ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యేకంగా వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం మితిమీరినదిగా ఆరోపణలు వస్తున్న వేళ, మిథున్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించడం గమనార్హం. ముందుగా నేతలు ఆరోపించినా, ఇటీవల వైసీపీ ఎంపీగా పనిచేసిన విజయసాయిరెడ్డి కూడా సీఐడీ విచారణలో ఈ స్కాంను నిజమని అంగీకరించారు. అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముందుండి నడిపించారని, వెనుక మిథున్ రెడ్డి ఉన్నారని కీలక విషయాలు బయటపడ్డాయి.
ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, సీఐడీ వాదనలు బలంగా ఉండటంతో కోర్టు ఆయనకు రిలీఫ్ ఇవ్వలేదు. ఈ కేసులో మిథున్ పాత్రపై అనేక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సీఐడీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అరెస్టు తథ్యమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మద్యం కుంభకోణం కేసు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. మిథున్ రెడ్డి వంటి ప్రముఖ నేత పేరు ఇందులో వినిపించడంతో పార్టీ పరువు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పుతో ఆయనపై అరెస్టు భయాలు తీవ్రంగా పెరిగిపోయాయి. ఇప్పటివరకు బెయిల్ ఆశించి బయట ఉన్న మిథున్… ఇక ఏదైనా సమాధానం ఇవ్వాల్సిన దశకు చేరినట్టే కనిపిస్తోంది.